
హైదరాబాద్, వెలుగు: మెసర్స్ బాలా కార్పొరేషన్ అనే సంస్థ నకిలీ విద్యుత్ బిల్లులను ఉపయోగించి జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొంది రూ.6.25 కోట్ల నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను క్లెయిమ్ చేసినట్లు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దీంతో ఈ సంస్థ అధినేత నాసరి వినోద్ కుమార్‌పై కేసు నమోదైంది. ఖైరాతాబాద్‌లోని సోమాజిగూడ-1 సర్కిల్‌లో ఉన్న బాలా కార్పొరేషన్ చిరునామా కూడా బోగస్ అని తేలింది. ఈ సంస్థ బొమ్మలు, వీడియో గేమ్‌ల వ్యాపారం కోసం రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, 2025 మార్చి, ఏప్రిల్ మధ్య సిమెంట్, రాగి పైపులు, ప్లైవుడ్ వంటి వాటి కోసం 1,268 ఈ-– వే బిల్స్‌ను సృష్టించింది.
ఈ బిల్లులతో నకిలీ ఐజీఎస్టీ ఐటీసీని క్లెయిమ్ చేయడమే కాకుండా, 32 ఇతర ట్యాక్స్ పేయర్లకు వస్తువులు తీసుకోకుండానే రూ.6.25 కోట్ల ఐటీసీ(ఎస్జీఎస్టీ అండ్ సీజీఎస్టీ)ని బదిలీ చేసింది. విచారణ అనంతరం సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు.