బలంగం కొమురయ్య కూతురు లచ్చవ్వ బ్యాక్గ్రౌండ్.. ఇంతకీ ఎవరీవిడ? 

బలంగం కొమురయ్య కూతురు లచ్చవ్వ బ్యాక్గ్రౌండ్.. ఇంతకీ ఎవరీవిడ? 

మానవ సంబంధాలను, తెలంగాణ రాష్ట్ర సంసృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా బలగం. చావుతో ముడిపడిన బంధాలు చూపించిన సినిమా బలగం. సినిమాలో కేవలం హీరో, హీరోయిన్లే కాకుండా ప్రతీ క్యారెక్టర్ కు ప్రధాన్యం ఉన్న సినిమా బలగం. కొడుకు, బిడ్డ, మనువడు, మనువరాళ్లు, కోడళ్లు, అల్లుళ్లు ఇలా అందరూ కలిసి ఉంటేనే ‘బలగం’అని నిరూపించిన సినిమా ఇది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరు వాళ్ల క్యారెక్టర్ కు జీవవం పోశారు.

సినిమాలో కొమురయ్య కూతురుగా లచ్చవ్వ పాత్రలో నటించి.. ఒక ఆడబిడ్డ మనో వేదనను కళ్లకు కట్టినట్లు చూపించింది రూప లక్ష్మి. ఆవిడ నటనతో ఆ పాత్రకు మరింత గుర్తింపు వచ్చింది. తన నటన చూసి కన్నీళ్లు పెట్టుకోని అభిమాని లేడు. దాంతో రూపకు మంచి క్రేజ్ వచ్చింది. ఇన్నాళ్లు వివిధ సినిమాల్లో నటించినా.. గుర్తింపు రాని రూప, బలగం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఇంతకీ  ఎవరీ లచ్చవ్వ? ఇదివరకు ఏ సినిమాల్లో నటించిందో తెలుసుకుందాం...

యాక్టర్ గా మొదట సీరియల్స్ లో నటించింది రూప. తర్వాత 2018లో ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. మిడిల్ క్లాస్ అబ్బాయి, వకీల్ సాబ్, క్రాక్, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి టాప్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన రూప లక్ష్మి జీవితంలో చాలా కష్టాలు పడింది.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి..

రూప లక్ష్మి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసేవాళ్లు. తర్వాత కుటుంబ పోషణ భారమై తనను వేరే వాళ్లకు దత్త ఇచ్చారు. దత్తత తీసుకున్న తండ్రి తప్ప మిగతా కుటుంబమంతా తనను వేరుగా చూసేవాళ్లట. చాలా ఇబ్బందులకు గురిచేసేవాళ్లు. తను మూడో క్లాస్ చదువుతున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ల వల్ల తను దత్తత వచ్చిన విషయం తెలుసుకొని సొంత అమ్మానాన్నల దగ్గరికి పారిపోయింది రూప. 

అక్కడ కూడా సమస్యలే ఎదురయ్యాయి. తోడబుట్టివాళ్లతో తను సరిగా కలువలేకపోయింది. దాంతో ఇటు తన తోడబుట్టిన వాళ్లకి, అటు పెంచుకున్న వాళ్ళకి దగ్గర కాలేకపోయింది రూప. ఈ సమస్యలు తన చదువుపై ప్రభావం చూపించాయి. అందుకే పెద్దగా చదువు కోలేదు రూప. తర్వాత తర్వాత సొంత కాళ్లపై ఎదిగి సినిమా ఫీల్డ్ లోకి వచ్చింది. ఇప్పుడు బలగం లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది రూప లక్ష్మి.