
- 32వ ఏడాది వేలానికి సిద్ధం
- గత ఏడాది రూ.30 లక్షలకు దక్కించుకున్న శంకర్‌రెడ్డి
ఎల్బీనగర్, వెలుగు:లడ్డు వేలం పాట అంటేనే గుర్తుకు వచ్చే బాలాపూర్ గణేశ్..ఈ లడ్డు కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే వేలంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. మొదట భక్తిగా..తర్వాత సెంటిమెంట్గా..అనంతరం ప్రెస్టీజ్ఇష్యూగా మారిపోయింది. ఏడాదికేడాది ఈ లడ్డు ధర పెరుగుతూ పోతుందే తప్ప తగ్గడం లేదు. 1980లో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠించారు.
1994లో మొదటిసారి లడ్డు వేలం పాట మొదలుపెట్టగా రూ.450కి కొలన్ మోహన్‌రెడ్డి దక్కించుకున్నారు. ఇప్పటివరకు 30 సార్లు వేలం నిర్వహించారు. 2020లో కరోనా కారణంగా వేలం లేకుండానే అప్పటి సీఎం కేసీఆర్ కు అందజేశారు. 2023లో 36 మంది పాల్గొనగా రూ. 27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి చేజిక్కించుకున్నారు. గత ఏడాది నలుగురు మాత్రమే పాల్గొనగా, బాలాపూర్‌కే చెందిన బీజేపీ లీడర్ కొలన్ శంకర్‌రెడ్డి అత్యధికంగా రూ.30 లక్షల వెయ్యికి కైవసం చేసుకున్నారు.
రూ.1116తో మొదలయ్యే పాట మెల్లి మెల్లిగా లక్షలకు చేరుకుంటుంది. వేలంలో పాల్గొనేందుకు బాలాపూర్ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారూ వస్తుంటారు. ఇంతకుముందు వరకైతే లడ్డూను గెలుచుకున్నవారు స్థానికులైతే వారు ఆ మొత్తాన్ని మరుసటి ఏడాది చెల్లించే వెసులుబాటు ఉండేది. కానీ, గత సంవత్సరం నుంచి రూల్స్ మార్చారు.. అంతకుముందు ఏడాది వేలంలో ఎంతకు కొన్నారో అంతే మొత్తం డిపాజిట్ చేయించుకుంటున్నారు.
ఏడుగురి పేర్లు ఖరారు
ఈ ఏడాది వేలంలో ఏడుగురు పాల్గొనబోతున్నారు. చంపాపేట్ నుంచి మర్రి రవికిరణ్ రెడ్డి, ఎల్బీనగర్‌నుంచి అర్బన్ గ్రూప్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, కంచర్ల శివారెడ్డి, కందుకూరు కొత్తగూడానికి చెందిన సామ రామ్ రెడ్డి, పీఎస్ కె గ్రూప్‌కు చెందిన మెంబర్స్, చంపాపేట్‌కు చెందిన జిట్టా పద్మా సురేందర్ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు.