బాల్క సుమన్ వీధి రౌడీలా ప్రవర్తించాడు.. పోలీసులపై దాడి చేయడం దారుణం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

బాల్క సుమన్ వీధి రౌడీలా ప్రవర్తించాడు.. పోలీసులపై దాడి చేయడం దారుణం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పద్మారావునగర్, వెలుగు: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయన అనుచరులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ పోలీసులపై దాడి చేయడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఖండించారు. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ ఘటనలో పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. 

ఈ మేరకు సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ రాకేశ్‌ను బుధవారం ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన సమయంలో కొందరు నాయకులు రౌడీ షీటర్ల మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. 

మహిళా పోలీసులని కూడా చూడకుండా దాడులకు పాల్పడటంపై మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల డ్యూటీకి గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.