హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్లో ఉన్న బాల్క సుమన్ను అరెస్ట్ చేశారు. సింగరేణిపై విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నాంపల్లి కోర్టులో బాల్క సుమన్ను హాజరు పర్చనున్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్రంలో భారీ విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు రైతులు వస్తలేరని, జనాన్ని ఆకట్టుకోవాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చెయ్యాలంటూ క్యాడర్హింస వైపు మళ్లేలా వ్యాఖ్యలు చేశారు.
సింగరేణి జీఎం ఆఫీసును తగలబెట్టాలని, అవసరమైతే సింగరేణి భవన్ను కాల్చెయ్యాలని, రైలు పట్టాలు కోసెయ్యాలని, అప్పుడే తమ సంఘానికి, తమ పార్టీకి, తమ లీడర్లకు మైలేజ్ వస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపై హరీశ్‌రావు, ఇతర పార్టీ ముఖ్య నేతలు ఉండడం గమనార్హం.
‘మన ఏరియాల గన్ని రైల్వే లైన్లున్నయ్.. రైలురోకో పేరుచెప్పి పట్టాలు కోసిపడేయిన్రి.. మహా అయితే 45 రోజులు జైలుకు పోతారేమో.. పొయ్యి రాన్రి.. జైలుకు పొయ్యేస్తే అదో మెడల్ లెక్క ఉంటది.. సీరియస్గా చెప్తున్నా.. పని చేస్తే పైసలు తన్నుకుంట వస్తయ్.. ఒక్కటి కాలవెట్టి చూడు ఎట్ల రావో పైసలు?’ అంటూ సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులను సుమన్ రెచ్చగొట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
