- ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటేనే బీజేపీకి లాభం
- కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా
- గుర్తింపు కోసం ‘కాక్రోచ్’ పార్టీతో కాంగ్రెస్ పోటీ పడుతోందని వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: రాహుల్ గాంధీయే తమ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటేనే బీజేపీకి లాభమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ను ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదని అందుకే.. ప్రజల దృష్టిని తమవైపు మళ్లించేందుకే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాల పేరుతో రాజకీయ డ్రామాలాడుతోందని ఫైర్ అయ్యారు. బుధవారం మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో కాంగ్రెస్‌ను ప్రజలు కనీసం ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదని, ఆ పార్టీ పరిస్థితి చూస్తుంటే ‘కాక్రోచ్’ పార్టీతో పోటీ పడుతున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.
నీట్ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో సాగునీరు, ఎరువులు అందక రైతులు అల్లాడుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ధర్నాలు చేయడం పెద్ద జోక్ అని మండిపడ్డారు. రాహుల్ గాంధీని కాబోయే ప్రధాని అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘రాహుల్ ప్రధాని కావడం దేవుడెరుగు.. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల’ అని ఆయన అన్నారు.
కరీంనగర్ దోపిడీపై ఆరా
కరీంనగర్‌లో అర్ధరాత్రి జరిగిన దోపిడీ దొంగల బీభత్సంపై బండి సంజయ్ ఆరా తీశారు. ఈ ఘటనపై కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోపిడీ దొంగలపై ఉక్కుపాదం మోపాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీమ్స్ ను రంగంలోకి దింపామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీపీ చెప్పినట్టు సంజయ్ వెల్లడించారు.
