కేసీఆర్‌‌ హిందూ పండుగలు జ‌రుపుకోనివ్వ‌కుండా చేస్తున్న‌డు

కేసీఆర్‌‌ హిందూ పండుగలు జ‌రుపుకోనివ్వ‌కుండా చేస్తున్న‌డు

నల్లగొండ: సీఎం కేసీఆర్ నిజమైన, నిఖార్సయిన ఉద్యమకారులను పక్కన పెట్టి, ఎంఐఎం తో జతకట్టి.. హిందూ పండగలపై కుట్రపూరితంగా ప్రవర్తిస్తున్నాడన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అక్రమిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే లను.. దొంగ దందాలు చేసుకొని, అక్రమంగా డబ్బులు సంపాదించుకోండ‌ని కేసీఆర్ వారిని ఉసిగొల్పుతున్నాడ‌న్నారు.

ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు తల్లి బక్కమ్మ మృతి చెందారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వెంకటేశ్వర్లుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాలనలో రాష్ట్రంలో అకృత్యాలు, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. ఈ రోజు ప్రతి గ్రామంలో… రాష్ట్రంలో ఏం జరుగుతుందనే చర్చ న‌డుస్తుంద‌న్నారు.

తెలంగాణలో కేసీఆర్ హిందువుల పండుగలను జరుపుకోనివ్వడం లేద‌ని, పండగలు చేసుకోవాలంటే కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి వచ్చిందన్నారు సంజ‌య్. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా గణేష్ విగ్రహాలు పెట్టిన యువకులను కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని, కొన్ని గ్రామాల్లో బలవంతంగా నిమర్జనం జ‌రిపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇంత జ‌రుగుతున్నా.. ముఖ్యమంత్రి స్పందించడం లేదని, ఏదో ఒక రోజు రాష్ట్ర ప్రజలు తిరగబడి కేసీఆర్ కి బుద్ధి చెపుతారన్నారు సంజ‌య్.

Bandi Sanjay fires on cm KCR over laying rules on Hindu festivals