- కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే
- రూ.9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు
కరీంనగర్, వెలుగు:కాళేశ్వరం సహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక రూ.9 వేల కోట్లకే పరిమితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్ కు దమ్ముంటే లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని సవాల్ విసిరారు. కరీంనగర్ లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్రమంత్రి బండి సంజయ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
‘ డిజైన్ లోపాలవల్లే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని అందరికీ తెలుసు. అయినా లక్ష కోట్ల ధనం వృథాపైనా, అవినీతిపైన సీబీఐ విచారణ జరపాలని రేవంత్ఎందుకు కోరడం లేదు? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐ లేఖ రాస్తున్నారు. మోటార్ల కొనుగోలులోనే పెద్ద అవినీతి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం’ అని సంజయ్ అన్నారు.
తేజస్వి మాటలను వక్రీకరించారు..
బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని సంజయ్అన్నారు. ‘తెలంగాణ ఉద్యమకారులను దేశ భక్తులతో పోల్చానని తేజస్వి నాతో చెప్పారు దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల విధానాల వల్ల లక్షలాది మంది చనిపోయారు. తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల 1,200 మంది బలిదానమయ్యారని తేజస్వి చెప్పారు. ఈ విషయాన్ని వక్రీకరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

