- తప్పేదో, ఒప్పేదో కోర్టు నిర్ణయిస్తుంది
- ప్రతి ఆరోపణకు కాలమే సమాధానం చెప్తుందన్న కేంద్ర మంత్రి
కరీంనగర్, వెలుగు: కొందరు తనను ఎదుర్కోలేకనే తన పిల్లలను, కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయంగా తనతో పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతకు ఇది నిదర్శనమన్నారు. తన కొడుకు భగీరథ్ పై వచ్చిన ఆరోపణలపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘నాకు చట్టంపై గౌరవం, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను.
దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుంది. అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన వ్యక్తి, నాయకుడిగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి. ప్రధాని మోదీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. ప్రతి ఆరోపణకు కాలమే సమాధానం ఇస్తుంది. ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది. సత్యమేవ జయతే’’ అని సంజయ్ పేర్కొన్నారు.
