
సీఎంను కలవాలనుకున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు డాక్టర్ కే. లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్ష నాయకులు రాజా సింగ్ లను గృహనిర్బంధంలో ఉంచడాన్ని మరియు బీజేపీ శాసన మండలి పక్ష నాయకులు ఎన్. రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కరోనా విషయంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నదని ఆయన అన్నారు. ‘కరోనా విషయంలో మేం ప్రజలను కాపాడడానికే తప్ప ఇంకొకటి ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రిని విపక్ష పార్టీల నేతలు కలవడం.. ప్రజా సమస్యలను వివరించి పరిష్కరించడానికి కృషి చేయడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అంతేకాకుండా.. నిరసన కార్యక్రమాలు చేయడం కూడా సర్వసాధారణం. మా నాయకులు సీఎంను కలవడానికి అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వకపోవడం దారుణం. సమస్యలను ఎత్తి చూపితే దాడి చేయడం సీఎంకు పరిపాటిగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి మంచిది కాదు. విపక్ష పార్టీల నేతలు సీఎంను కలుస్తాం అంటే అరెస్టు చేయడం, గృహనిర్బంధం చేయడంలాంటివన్నీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు. ప్రజాస్వామ్య వాదులందరూ ముఖ్యమంత్రిని ఖండించాలి. ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అరెస్టులకు, ఎదురు దాడులకు బీజేపీ భయపడదు’ అని ఆయన అన్నారు.
For More News..