- కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు బండి సంజయ్ లేఖ
- కేసీఆర్, రేవంత్‌వి ‘కాంప్రమైజ్’ పాలిటిక్స్ అంటూ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల విచారణలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్అయ్యారు. కాళేశ్వరం ‘సేఫ్టీ’ని తాకట్టు పెడుతరా? అంటూ మండిపడ్డారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన రాజకీయ వేదికను పంచుకోవడాన్ని తప్పుపడుతూ, అనిల్ జైన్పై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద వెయ్యి బోర్ హోల్స్ తవ్వాలని ఎన్డీఎస్ నివేదిస్తే.. అందుకు భిన్నంగా 100 బోర్ హోల్స్ తవ్వితే సరిపోతుందని చెప్పడమేంటి?’ అని ప్రశ్నించారు. బ్యారేజీల స్థితిపై భూగర్భ, భూభౌతిక పరీక్షలు నిర్వహించాని సూచించి రెండేళ్లయినా పురోగతి లేదని విమర్శించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలో కేవలం 6 బోర్ హోల్స్ మాత్రమే పూర్తి చేసిందన్నారు. అన్నారం, సుందిల్లలో ఒక్క బోర్ హోల్స్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మే చివరి నాటికి బోర్ హోల్స్ ను పూర్తి చేయాలని సూచించినా పట్టించుకోవడం లేద న్నారు.
ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డను సందర్శించారని, ఈ కార్యక్రమంలో ఎన్డీఎన్ఏ చైర్మన్ ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. కాళేశ్వరం స్కామ్ విషయంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ‘కాంప్రమైజ్’ పాలిటిక్స్ నడుస్తుందని ఆరోపించారు. హైకోర్టులో సరైన వాదనలు వినిపించలేదని, రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగితే, కేవలం రూ. 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడం ఆ కుట్రలో భాగమేనని విమర్శించారు. ‘‘ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఇక్కడ నుంచి మూటలు వెళ్తున్నాయి.. అందుకే ఇక్కడ కేసులు క్లోజ్ అవుతున్నాయి. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే”అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

