కేటీఆర్ దోపిడీ ఫార్ములాలు నాకు తెలియవు : బండి సంజయ్

కేటీఆర్ దోపిడీ ఫార్ములాలు నాకు తెలియవు : బండి సంజయ్
  • ఆయన అహంకారం వల్లే కేసీఆర్ ఫామ్ హౌస్​కు పరిమితమైన్రు: బండి సంజయ్ 
  • ప్రధాని సభను సక్సెస్ చేయాలంటూ హైదరాబాద్​లో బైక్​ ర్యాలీ

ముషీరాబాద్, వెలుగు: కేటీఆర్​లా దోచుకోవడం తనకు తెలియదని, రైతులకు బేడీలు వేయడం, డ్రగ్స్ సంస్కృతి, కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు.. వంటి దోపిడీ ఫార్ములాలు తెలియవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ఎద్దేవా చేశారు. ఆయన అహంకారం వల్లే కేసీఆర్​ఫామ్​హౌస్​కు పరిమితమయ్యారని, బీఆర్ఎస్​మళ్లీ అధికారంలోకి రావడం కలేనని విమర్శించారు. ఈ నెల10న సికింద్రాబాద్​లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ.. మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్​నుంచి ముషీరాబాద్, చిలకలగూడ, సీతాఫల్‌‌మండి, తార్నాక, క్లాక్ టవర్, బేగంపేట్ మీదుగా అమీర్​పేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులే ఇస్తోందని, అవే లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశమే లేదని  తెలిపారు. తాము ఢిల్లీ నుంచి నిధులు తెస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సొమ్మును ఢిల్లీలోని తమ హైకమాండ్​కు పంపిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మద్దూరు శివాజీ, సారంగపాణి, నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.