తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం

తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశాలోని గోపాల్ పూర్ కి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పూరీకి 460 కిలోమీటర్లు, పారాదీప్ కి 540 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమైంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను తాకనుంది. తుపాన్ తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశముందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.

తుపాన్ దిశను మార్చుకొని ఒడిశా వైపుగా 5వ తేదీన మధ్యాహ్నానికి పూరీ దగ్గర తీరం తాకే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు. తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమబెంగాల్ వైపు వెళ్తుందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తుపాన్ ప్రభావంతో సముద్ర అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 

మరోవైపు తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్  బృందాలను ఆయా జిల్లాల్లో పెట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు.