V6 News

ఆర్సీబీ ఫోర్.. బెంగళూరు ఖాతాలో నాలుగో విజయం.. 5 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపు

ఆర్సీబీ ఫోర్.. బెంగళూరు ఖాతాలో నాలుగో విజయం.. 5 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపు
  • రాణించిన విరాట్, బౌలర్లు

బెంగళూరు: ఐపీఎల్‌‌‌‌19వ సీజన్‌‌‌‌లో డిఫెండింగ్ చాంప్ రాయల్‌‌‌‌ చాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్తోంది. మరోసారి ఆల్‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌తో ఆకట్టుకున్న ఆ జట్టు  నాలుగో విజయం అందుకుంది.  చిన్నస్వామి స్టేడియంలో  బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 5   వికెట్ల తేడాతో  లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. 

మిచెల్ మార్ష్ (32 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), ముకుల్ చౌదరి (28 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), ఆయుష్ బదోనీ (24 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 38) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ దార్ (4/24), భువనేశ్వర్ (3/27), జోష్ హేజిల్‌‌‌‌వుడ్ (1/20) సత్తా చాటారు. అనంతరం విరాట్ కోహ్లీ (34 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌ 49) మెరుపులతో ఆర్సీబీ 15.1 ఓవర్లలోనే 149/5 స్కోరు చేసి గెలిచింది.   హేజిల్‌వుడ్‌ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

  • లక్నో తడబాటు

ఆర్సీబీ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టాస్ ఓడి  బ్యాటింగ్‌‌‌‌కు దిగిన లక్నో  తక్కువ స్కోరుకే పరిమితం అయింది.  గత మ్యాచ్‌‌‌‌లో తడబడిన ఆసీస్ పేసర్ హేజిల్‌‌‌‌వుడ్, పాత ఫామ్‌‌‌‌ చూపెట్టాడు. పవర్ ప్లేలో రెండు ఓవర్లు వేసిన అతను ఆరు రన్స్ మాత్రమే ఇచ్చి కట్టడి చేశాడు.  ఓ సిక్స్‌‌‌‌తో జోరు మీద కనిపించిన ఓపెనర్ ఐడెన్ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (12)ను మూడో ఓవర్లో  రసిఖ్‌‌‌‌ పెవిలియన్ చేర్చాడు. 

హేజిల్‌‌‌‌వుడ్ వేసిన బాల్ తగిలి  కెప్టెన్ రిషబ్ పంత్ (1)  రిటైర్డ్ హర్ట్ అవడం లక్నోకు మైనస్ అయింది. భువనేశ్వర్ కూడా కట్టడి చేయడంతో పవర్ ప్లేలో ఆ టీమ్ 35/1తో నిలిచింది. ఏడో ఓవర్లో హిట్టర్ నికోలస్ పూరన్ (1)ను బౌల్డ్ చేసిన హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ ఆ టీమ్‌‌‌‌ను దెబ్బకొట్టాడు. మరో ఎండ్‌‌‌‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్‌‌‌‌ ఒంటరి పోరాటం చేశాడు. క్రునాల్ బౌలింగ్‌‌‌‌లో 4, 6తో ఇన్నింగ్స్‌‌‌‌కు జోష్​ తెచ్చే ప్రయత్నం చేశాడు. ఫిఫ్టీ చేసేలా కనిపించిన మార్ష్‌‌‌‌తో పాటు అబ్దుల్ సమద్ (0)ను వరుస ఓవర్లలో ఔట్ చేసిన స్పిన్నర్ క్రునాల్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 

ఈ టైమ్‌‌‌‌లో ఆయుష్ బదోనీ, ముకుల్ చౌదరి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. ఇద్దరూ క్రమం తప్పకుండా బౌండరీలు కొట్టడంతో 15 ఓవర్లకు 112/4తో నిలిచిన లక్నో 170 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, స్లాగ్ ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు మళ్లీ విజృంభించారు. జోరుమీదున్న ఆయుష్‌‌‌‌ను రసిఖ్ ఔట్ చేయగా..  మళ్లీ బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన కెప్టెన్ పంత్‌‌‌‌ను 17వ ఓవర్లో భువీ పెవిలియన్ చేర్చాడు.  జార్జ్‌‌‌‌ లిండే (7), షమీ (0)ని కూడా భువీ  ఔట్ చేయగా.. రసిఖ్ వేసిన లాస్ట్ ఓవర్లో ఓ  సిక్స్ కొట్టిన ముకుల్‌‌‌‌తో పాటు అవేశ్ ఖాన్ (1) పెవిలియన్ చేరడంతో లక్నో ఆలౌటైంది. 

  • ఆర్సీబీ అలవోకగా..

ఇంపాక్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన ఓపెనర్‌‌‌‌‌‌‌‌ విరాట్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్‌‌‌‌తో చిన్న టార్గెట్‌‌‌‌ను ఆర్సీబీ ఈజీగా ఛేజ్ చేసింది. ఛేజింగ్‌‌‌‌లో ఆ టీమ్‌‌‌‌కు మంచి ఆరంభం దక్కలేదు. ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్ ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (7)ను రెండో ఓవర్లోనే ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేసి లక్నో క్యాంప్‌‌‌‌లో ఆశలు రేపాడు. అయితే కింగ్ కోహ్లీ ప్రత్యర్థికి ఆ చాన్స్ ఇవ్వలేదు. షమీ వేసిన మూడో ఓవర్లో ముచ్చటైన షాట్లతో హ్యాట్రిక్ ఫోర్లతో జోరందుకున్నాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (10) ఇబ్బంది పడినా కోహ్లీ మాత్రం తన క్లాస్ బ్యాటింగ్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. ప్రిన్స్‌‌‌‌ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో నాలుగు ఫోర్లతో అలరించాడు. 

ఆపై స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీకి అద్భుతమైన సిక్స్‌‌‌‌తో స్వాగతం పలకగా.. పవర్ ప్లేను ఆర్సీబీ 60/1తో ముగించింది.  అవేశ్ వేసిన  ఎనిమిదో ఓవర్లో పడిక్కల్‌‌‌‌ ఔటైనా.. షమీ బౌలింగ్‌‌‌‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ (27) వరుసగా రెండు సిక్సర్లతో ఛేజ్‌‌‌‌కు మరింత జోష్ తెచ్చాడు. ఫిఫ్టీకి ఒక్క రన్ దూరంలో అవేశ్ బౌలింగ్‌‌‌‌లో కోహ్లీ క్యాచ్ ఔట్ అయ్యాడు.  ఈ టైమ్‌‌‌‌లో పాటిదార్​కు తోడైన జితేశ్ శర్మ (23) దిగ్వేశ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 4తో స్టేడియాన్ని హోరెత్తించి 23 రన్స్‌‌‌‌ పిండుకున్నాడు.  గెలుపు ముంగిట రజత్, జితేశ్ ఇద్దరూ ఔటైనా... టిమ్ డేవిడ్ (14 నాటౌట్‌‌‌‌ ), రొమారియో షెఫర్డ్ ( 14 నాటౌట్‌‌‌‌) మిగతా లాంఛనం పూర్తి చేశారు.

  • సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 146 ఆలౌట్‌‌‌‌ (మార్ష్ 40, ముకుల్ 39, రసిఖ్ దార్ 4/24, భువనేశ్వర్ 3/27).
బెంగళూరు: 15.1 ఓవర్లలో 149/5 (కోహ్లీ 49, రజత్ 27, ప్రిన్స్ యాదవ్ 3/32).

  • పంత్‌‌‌‌ మోచేతికి గాయం

ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌‌‌‌కు గాయమైంది. ఐదో ఓవర్లో హేజిల్‌‌‌‌వుడ్ వేసిన ఓ బాల్‌‌‌‌ పంత్ ఎడమ మోచేతికి బలంగా తగలడంతో అతను ఖాతా తెరవకముందే  రిటైర్డ్ హర్ట్‌‌‌‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (118/5) ఎడమ మోచేతికి భారీ బ్యాండేజ్‌తో మళ్ళీ బ్యాటింగ్‌‌‌‌కు వచ్చినా భువనేశ్వర్‌‌ బౌలింగ్‌‌‌‌లో రెండు బాల్సే ఆడి పెవిలియన్ చేరాడు.