చెరువులకు ప్రాణం పోసిన సాహితి పింగళి

చెరువులకు ప్రాణం పోసిన సాహితి పింగళి

మబ్బులు ఉరుముతున్న శబ్దం వస్తే చెరువులు ఆనందిస్తాయో లేదో తెలియదు కానీ, ఇరవయ్యేళ్ల సాహితి పేరు చెప్తే మాత్రం అవి ఆనందంతో ఉరకలు వేేస్తాయి. ఎందుకంటే.. ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో చెరువులకు ప్రాణం పోసింది ఈ యంగ్ సైంటిస్ట్. ‘వాటర్ ఇన్‌‌సైట్స్’ పేరుతో తాను క్రియేట్ చేసిన యాప్.. ఇప్పుడు ప్రపంచంలోని చెరువులను క్లీన్ చేయడంలో బిజీగా ఉంది. బెంగళూరుకి చెందిన సాహితి పింగళి.. స్టాన్‌‌ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోంది. తను పదిహేడేండ్ల వయసులో ఉన్నప్పుడే చెరువులపై ఇష్టం పెంచుకుంది. డంప్ యార్డ్స్‌‌లా మారుతున్న చెరువులను చూసి.. ‘వీటిని కాపాడడం ఎలా’ అని ఆలోచించింది. తన ఫ్రెండ్స్‌‌తో కలిసి ప్రతివారం చెరువులను పరిశీలించేందుకు వెళ్లేది. చెరువులోకి దిగి, తాడుతో కట్టిన మగ్గుతో నీటిని తోడేది. ఇంటికి వెళ్లి మగ్గులోని నీటిని ల్యాబ్ టెస్ట్ చేసి నీళ్లు కలుషితమైనవో, కాదో తెలుసుకునేది. అయితే నీళ్లను టెస్ట్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని గమనించిన సాహితి దీనికో సింపుల్ సొల్యూషన్ ఆలోచించాలనుకుంది.  ఏ చెరువు ఎంత వరకు సేఫ్? అనే విషయం అందరికీ తెలిసేలా ఏదైనా కొత్తగా ఇన్నొవేట్ చేయాలనుకుంది. అలా పుట్టిందే ‘వాటర్ ఇన్‌‌సైట్స్’ యాప్.

వలంటరీగా..

సాహితి సంవత్సరం పాటు కష్టపడి ‘వాటర్ ఇన్‌‌సైట్స్’ మొబైల్‌‌ యాప్‌‌ను తయారుచేసింది. ఇదొక ఆన్‌‌లైన్ వాటర్ డేటా యాప్. కొన్ని ఎలక్ట్రానిక్‌‌ సెన్సర్స్, కెమికల్‌‌ టెస్ట్‌‌ స్ట్రిప్స్‌‌ సాయంతో ఇది పనిచేస్తుంది.  ఇందులో ప్రపంచంలోని ఎన్నో చెరువుల డేటా ఉంటుంది. ‘ఏ చెరువు నీళ్లు ఎంతవరకు సేఫ్?, వాటిని క్లీన్ చేయడం ఎలా?’ అనే వివరాలు ఈ యాప్‌‌లో ఉంటాయి. అయితే ఈ డేటాను ఎవరికి వారు వలంటరీగా సేకరించాలి.  ప్రపంచంలోని చెరువులన్నింటినీ క్లీన్ చేయాలంటే.. ప్రతి ఒక్కరూ తమవంతుగా ఈ యాప్‌‌లో వాటర్ డేటాను సబ్మిట్ చేయాలి. ఎవరికి వారు వలంటరీగా దగ్గర్లోని చెరువులకు వెళ్లి, అక్కడి నీళ్ల శాంపిల్‌‌ను టెస్ట్ చేసి ఆ డేటాను యాప్‌‌లో అప్‌‌లోడ్ చేయాలి. టెస్ట్ కోసం కావాల్సిన స్ట్రిప్స్‌‌ను ‘వాటర్‌‌‌‌ ఇన్‌‌సైట్స్’ వెబ్‌‌సైట్‌‌లో ఆర్డర్ చేయొచ్చు. అంటే ఈ యాప్ చెరువులను క్లీన్ చేసే మిషన్ లాంటిదన్న మాట.

టెస్ట్ ఇలా..

వాటర్ ఇన్‌‌సైట్స్ మిషన్‌‌లో భాగం అవ్వాలనుకుంటే ముందుగా వాటర్ ఇన్‌‌సైట్స్ వెబ్‌‌సైట్‌‌లో టెస్టింగ్ స్ట్రిప్స్ ఆర్డర్ చేయాలి. వాటిని తీసుకెళ్లి చెరువులోని నీటితో టెస్ట్ చేయాలి. చెరువులోని నీటిని కొద్దిగా తీసుకొని అందులో స్ట్రిప్‌‌ ముంచితే  అది బ్లూ కలర్‌‌లోకి మారితే ఆ నీళ్లు తాగడానికి పనికొస్తాయని అర్థం. ఒకవేళ అవి ఊదా రంగులోకి మారితే స్నానానికి మాత్రమే పనికొస్తాయి. పసుపు రంగులోకి మారితే చేపలు పెంచడానికి వాడుకోవచ్చు. ఇలా టెస్ట్ చేసిన డేటాను మొబైల్‌‌ యాప్‌‌లోని కలర్‌‌ రికగ్నిషన్‌‌ అండ్‌‌ మ్యాపింగ్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ గుర్తిస్తుంది. ఈ డేటా ‘వాటర్ ఇన్‌‌సైట్స్’ క్లౌడ్ ప్లాట్‌‌ఫామ్‌‌లో సేవ్ అవుతుంది. ఈ యాప్‌‌ను స్మార్ట్‌‌ఫోన్‌‌లో డౌన్‌‌లోడ్‌‌ చేసుకుంటే ఏ చెరువులో ఎంత కాలుష్యం ఉందో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అంతేకాదు, ఆ చెరువులోని కాలుష్యాన్ని నివారించేందుకు మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. 

గ్రహానికి పేరు 

గతంలో ‘మసాచుసెట్స్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ’ నిర్వహించిన ‘ప్రికాలేజ్‌‌ సైన్స్‌‌ కాంపిటీషన్‌‌’లో సాహితి చేసిన ఈ ఇన్నొవేషన్‌‌కు.. గోల్డ్ మెడల్ వచ్చింది. అంతేకాదు, ఎన్నో అవార్డులు అందుకుంది.  ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్.. పాలపుంతలో పేరులేకుండా ఉన్న చిన్న గ్రహాల్లో ఒక దానికి సాహితి  పేరు పెట్టి ఆమెని సత్కరించింది.