టూరిజం హోటళ్లలో బార్లు

టూరిజం హోటళ్లలో బార్లు

ఇప్పటికే ఐదింట్లో ఏర్పాటు.. మరో 15కు ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరిన్ని హరిత హోటళ్లలో త్వరలో బార్లు రానున్నాయి. వీటిలో ఇప్పటికే రెస్టారెంట్లు నడుస్తుండగా టూరిస్టుల కోసం బార్లు కూడా తెరవాలని టూరిజం అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే 5 హోటళ్లలో బార్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఆమ్దానీ మస్తు వస్తుండడంతో మిగతా హోటళ్లలోనూ బార్లు ఓపెన్​ చేయాలని సర్కారు భావిస్తున్నది. 15 హరిత హోటళ్లలో బార్ల కోసం  అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

వికారాబాద్, రామప్ప, లక్నవరం, తాడ్వాయి, మేడారం, భద్రాచలం, కాళేశ్వరం, శామీర్ పేట, కీసరగుట్ట, సింగూరు, వేములవాడ, పాకాల, బాసర, పోచంపల్లి హోటళ్లలో బార్లు పెడతారని సమాచారం.  రాష్ట్రంలో 28 టూరిజం హరిత హోటళ్లున్నాయి. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా, గోల్కొండలో తారామతి బారాదరి హోటల్, హనుమకొండ హరిత కాకతీయ, నిజామాబాద్ లోని హరిత ఇందూరు, నాగార్జున సాగర్ లోని హరిత హోటళ్లలో బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల నిరుడు హోటళ్లు మూతపడి, టూరిస్టులు తగ్గినా ఇవి మాత్రం బాగానే సంపాదించాయి. తారామతికి నిరుడు రూ.26.28 లక్షలు రాగా.. ఇప్పుడు రూ.39 లక్షలు దాటింది. హనుమకొండ హరిత కాకతీయ గతేడాది రూ.20.19 లక్షలు, ఈసారి ఇప్పటికే రూ.27 లక్షలు ఆర్జించింది. సాగర్, హరిత ఇందూరు బార్లు కూడా లాభాల్లో ఉన్నాయి.