కాకా బీఆర్ అంబేడ్కర్ కాలేజీలో.. బీబీఏ లాజిస్టిక్‌ కోర్సు

కాకా బీఆర్ అంబేడ్కర్ కాలేజీలో..  బీబీఏ లాజిస్టిక్‌ కోర్సు

ముషీరాబాద్, వెలుగు: ఓయూ, కాకతీయ, మహాత్మా గాంధీ  వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో కొత్తగా బీబీఏ లాజిస్టిక్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బిజినెస్ లాజిస్టిక్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఈ మూడు వర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. బుధవారం బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేడ్క ర్ కాలేజీలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగిం ది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ మహ్మద్, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, ప్రొఫెసర్ యాదగిరి సమక్షంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మహాత్మా గాంధీ వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణారావు, లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ప్రొఫెసర్ గణేషన్‌ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 

సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కిల్ అండ్ పాలసీలపై ప్రొఫెసర్ సుబ్బారావు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. లాజిస్టిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సుకు అవసరమైన సహాయాన్ని ఉన్నత విద్యా మండలి అందిస్తుందని రిజిస్ట్రార్లు తెలిపారు. అలాగే, ఓయూ పరిధిలో ఉన్న కాకా బీఆర్ అంబేడ్కర్  ఇన్‌స్టిట్యూషన్స్ లో కూడా ఈ కొత్త కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు వారు వెల్లడించారు.