IPL 2024: మయాంక్ వచ్చేస్తున్నాడు.. వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందా..?

IPL 2024: మయాంక్ వచ్చేస్తున్నాడు.. వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందా..?

ఐపీఎల్ లో అనూహ్యంగా దూసుకొచ్చి ట్రెండింగ్ లో ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మయాంక్ యాదవ్ అనే చెప్పాలి. ఈ యువ 21 ఏళ్ళ యువ బౌలర్ తన బౌలింగ్ తో ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. పేస్ ఎవరైనా వేస్తారు.. కానీ మయాంక్ మాత్రం నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు. బ్యాటర్ ఎవరైనా ఇతని బౌలింగ్ ధాటికి కుదేలవుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టడమే కాదు.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ సంచలనంగా మారాడు.

ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున మూడే మ్యాచ్ లాడి రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. అయితే ఏప్రిల్ 7న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత లక్నో ఆడిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. తాజాగా అతని ఫిట్ నెస్ పై ఒక క్లారిటీ వచ్చింది. నివేదికల ప్రకారం.. నేడు (ఏప్రిల్ 30) ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్ లో ఆడడం దాదాపుగా  ఖాయమైంది. ఈ మ్యాచ్ కు ముందు మయాంక్ అన్ని ఫిట్‌నెస్ పరీక్షలను క్లియర్ చేసినట్టు తెలుస్తుంది.

అతను నెట్స్ లో బౌలింగ్  ప్రాక్టీస్ చేశాడని లక్నో అసిస్టెంట్ కోచ్ శ్రీరామ్ తెలిపాడు. మయాంక్ కోలుకోవడంతో ఇప్పుడు అతన్ని టీ20 వరల్డ్ కప్ కోసం సెలక్ట్ చేస్తారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొంతమంది దిగ్గజాలు మయాంక్ యాదవ్ ను తమ టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం కల్పించారు. బుమ్రా, అర్షదీప్ సింగ్, సిరాజ్ రూపంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఈ మెగా టోర్నీకి సెలక్టవ్వడం దాదాపుగా ఖాయమైంది. మరో పేసర్ కావాలనుకుంటే ఆవేశ్ ఖాన్ లేదా మయాంక్ యాదవ్ లలో ఒకరికే స్థానం దక్కే అవకాశం ఉంది.