లైంగిక ఆరోపణలు .. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్

లైంగిక ఆరోపణలు ..  ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్

లోక్‌‌సభ ఎన్నికల వేళ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న హసన్ ఎంపీ, ఎన్డీయే అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసింది.  మహిళలతో అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  అంతేకాకుండా ప్రజ్వల్‌కు పార్టీ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. "ప్రజ్వల్ రేవణ్ణపై సిట్‌ దర్యాప్తును స్వాగతిస్తున్నాం. సిట్ విచారణ పూర్తయ్యే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా పార్టీ జాతీయ అధ్యక్షుడికి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం" అని జేడీ(ఎస్) కోర్ కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ తెలిపారు. 

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమని పార్టీ చీఫ్ హెచ్‌డి కుమారస్వామి అన్నారు. ప్రస్తుతానికి ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేశామని. సిట్ విచారణ పూర్తయిన తర్వాత నిందితుడు అని తేలితే.. పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని ప్రకటించారు. అటు  ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.  

మరోవైపు తన కొడుకు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని జేడీఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నామని  తెలిపారు. అభియోగాలు రుజువైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. రేవణ్ణతో పాటు ఆయన తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ వందలాది మంది మహిళలను లైంగికంగా వేధించినట్టు అనేక వీడియోలు బయటికొచ్చాయి. దీనిపై  రేవణ్ణ విలేకర్లతో  మాట్లాడారు.  ‘‘చట్టపరంగా దీనిని ఎదుర్కొంటాం. ఆ వీడియోలన్ని నాలుగైదేండ్ల క్రితం నాటివి. రాజకీయ కక్ష సాధింపులో  భాగంగా వాటిని బయట పెట్టారు.  చట్టప్రకారం వారిని చర్యలు తీసుకోనివ్వండి”అని పేర్కొన్నారు.