- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
సైఫాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియ వల్ల బీసీలకు ఎలాంటి లాభం చేకూరదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ కులాల వారీ గణన లేకుండా చేసే సర్వే నిరర్ధకమని ఆయన విమర్శించారు. ఈ మేరకు సోమవారం సైఫాబాద్‌లోని బీసీ జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతేడాది కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో సమగ్ర కుల గణన చేపడతామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత జనగణనలో బీసీల లెక్కలపై స్పష్టత లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నమూనాగా తీసుకుని కేంద్రం ముందుకు సాగాలని ఆయన సూచించారు. అనంతరం ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్ రావు మాట్లాడుతూ.. బీసీల డిమాండ్ల సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు.

