నేడు (మే 14) బీసీ గురుకుల స్టూడెంట్లకు ప్రతిభా పురస్కారాలు..508 మంది టాపర్లను సన్మానించనున్న మంత్రి పొన్నం

నేడు (మే 14) బీసీ గురుకుల స్టూడెంట్లకు ప్రతిభా పురస్కారాలు..508 మంది టాపర్లను సన్మానించనున్న మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు : బీసీ గురుకులాలు, హాస్టళ్లకు చెందిన పదో తరగతి, ఇంటర్ టాపర్లకు గురువారం ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తోందన్నారు. గతేడాది కూడా బీసీ గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు పురస్కారాలు అందజేశామని చెప్పారు.  2025–26 విద్యా సంవత్సరానికి ప్రతిభావంతులైన మొత్తం 508 మంది విద్యార్థులను బంజారాహిల్స్ లోని కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్ లో సన్మానించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకులాల్లో 147 మంది విద్యార్థులు 576 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. బీసీ హాస్టళ్లలో 67 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించారన్నారు. ఇంటర్మీడియెట్ సెకండియర్ లో మొత్తం 165 మంది, ఫస్ట్ ఇయర్ లో 129 మంది విద్యార్థులను సన్మానించనున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.