బషీర్‌బాగ్, వెలుగు: పీఎం మోదీ బీసీ వ్యతిరేక చర్యలను మానకపోతే దేశవ్యాప్త ఓబీసీ ఉద్యమం మొదలవుతుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను 60 శాతానికి పెంచాలని, మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లతో ఆగస్టు 7న బెంగళూరులో ఓబీసీ 11వ జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్లు జాజుల వెల్లడించారు.
శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశ్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్రం చేపట్టే జాతీయ జనగణనలో ఓబీసీ కులాలను ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే విడిగా గుర్తించి లెక్కించాలని డిమాండ్ చేశారు. బెంగళూరు సభకు కర్నాటక సీఎం డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని జాజుల వివరించారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు ఈ సభకు వస్తారన్నారు
