- కుమ్మెర నిందితులను ఇంకా అరెస్ట్ చేయరా..? ఇది ప్రభుత్వ చేతగానితనమే
- ఇందిరా పార్కు వద్ద బీసీ నేతల ధర్నా
ముషీరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనపై బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్, విజిఆర్ నారగోని, ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక రెడ్డి రాజ్యమా? అని ప్రశ్నించారు.
కుమ్మెర ఘటన జరిగి పది రోజులు గడిచినా నిందితులను అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వ చేతగానితనమేనని, తక్షణమే బీసీలకు రక్షణగా అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. 2029లో తెలంగాణకు బీసీ సీఎం కాబోతున్నారని, రేవంత్ రెడ్డిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని హెచ్చరించారు. అనంతరం సచివాలయ ముట్టడికి యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇందిరా పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది.
