- బీసీ ఆక్రోశ సభను సక్సెస్ చేయాలి
- బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్
ముషీరాబాద్, వెలుగు : ఈనెల 15న కామారెడ్డిలో జరిగే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ బహుజన రాజ్యస్థాపన కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాలన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్డ్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సభకు అధ్యక్షత వహించిన పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వెంకన్నగౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్ సాధ్యమవుతుందన్నారు. బీసీల అభివృద్ధి కోసం బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలన్నారు. ఎలికట్టే విజయకుమార్ గౌడ్ మాట్లాడుతూ చట్టసభల్లో మేమెంతో.. మాకంతా వాటా కావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు అంబాల నారాయణగౌడ్, వి.నాగభూషణం, గడ్డమీది విజయకుమార్ గౌడ్, బడేసాబ్, నెర్దం భాస్కర్, మెట్టు ధన్రాజ్, ఓయూ జాక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
