బీసీలకు రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి..14 బీసీ సంఘాల డిమాండ్

బీసీలకు రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి..14 బీసీ సంఘాల డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీల సంక్షేమం, అభివృద్ధికి రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం విద్యానగర్ బీసీ భవన్​లో జరిగిన14 బీసీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేండ్లుగా రాష్ట్రంలో బీసీ సంక్షేమం కుంటుపడిందని, కొత్త పథకాలు లేవు, ఫీజులు, స్కాలర్​షిప్​లు చెల్లించడం లేదన్నారు. 

బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. బీసీలను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణిచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే మున్సిపల్, కార్పొరేషన్, జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు, ఆర్. అరుణ్ కుమార్, రాజేందర్, పగిళ్ల సతీశ్, అనంతయ్య, కిషోర్, అనురాధ పాల్గొన్నారు.