Hardik Pandya IPL Trade: ఐపీఎల్‌లో రోజు రోజుకూ ఊపందుకుంటున్న ప్లేయర్ ట్రేడింగ్ వ్యవహారాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి మరో జట్టులోకి వెళ్తాడనే వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్న వేళ, టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ బీసీసీఐ జోక్యంపై తీవ్రంగా మండిపడ్డాడు. హార్దిక్ ఏ జట్టులోకి వెళ్తున్నాడు? ఎంతకు ట్రేడింగ్ జరుగుతోంది? అనే విషయాలు కేవలం రెండు ఫ్రాంచైజీలు, ఆ ప్లేయర్, బీసీసీఐకి మాత్రమే తెలియకుండా.. బోర్డే పూర్తి పవర్స్ తీసుకుని పారదర్శకమైన ఆర్థిక లావాదేవీలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని సన్నీ స్పష్టం చేశారు.
ట్రేడింగ్ రహస్యాలపై గవాస్కర్ ఫైర్:
మిడ్-డే పత్రికలోని తన తాజా కాలమ్‌లో సునీల్ గావస్కర్ ఐపీఎల్ ట్రేడింగ్ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. ట్రేడింగ్ విండో సమయంలో ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి ఆటగాళ్లు మారినప్పుడు దానికి సంబంధించిన నగదు లావాదేవీలు, డీల్ రూల్స్ రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని బీసీసీఐని ప్రశ్నించారు. ఈ డీల్ వివరాలు కేవలం బీసీసీఐ, ప్లేయర్, సంబంధిత ఫ్రాంచైజీల దగ్గర మాత్రమే ఉండటంతో మిగిలిన జట్లకు ఎలాంటి సమాచారం ఉండటం లేదని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్ అయిన ఐపీఎల్ పారదర్శకతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ లో పారదర్శకతే ఏకైక మార్గం:
ఐపీఎల్‌లో ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టును నిర్మించుకోవడానికి ఒక శాలరీ క్యాప్ (పరిమితి) ఉంటుంది. అయితే ట్రేడింగ్ సమయంలో బదిలీ అయ్యే కోట్ల రూపాయల వివరాలు బయటకు రాకపోవడంతో ఏ జట్టు కూడా శాలరీ క్యాప్ నిబంధనలను దాటలేదని ఇతర ఫ్రాంచైజీలు నిర్ధారించుకోలేకపోతున్నాయని సునీల్ గావస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. లీగ్‌పై అనవసర విమర్శలు రాకుండా ఉండాలంటే బీసీసీఐ నేరుగా నిబంధనలను కఠినతరం చేసి, ట్రేడింగ్ జరిగే అన్ని ఆర్థిక లావాదేవీలని బహిర్గతం చేసేలా పర్యవేక్షించాలని సూచించారు.
►ALSO READ | రషీద్ భాయ్ సైడ్ హటో.. ఆఫ్ఘన్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?
కెప్టెన్సీ ఇస్తేనే ట్రేడింగ్.. హార్దిక్ కీలక షరతు:
2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారిన హార్దిక్ పాండ్యా.. అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, డ్రెస్సింగ్ రూమ్ వివాదాలు, అభిమానుల వ్యతిరేకత కారణంగా ముంబైని వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 కంటే ముందే ముంబైని వదిలి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లేదా గుజరాత్ టైటాన్స్ (GT) వైపు వెళ్లేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాడు పాండ్యా. ఏ జట్టులోకి వెళ్లినా తనకు కెప్టెన్సీ ఇవ్వాలనే ఏకైక షరతుతో హార్దిక్ ట్రేడింగ్ చర్చలు జరుపుతుండటం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.
