
న్యూఢిల్లీ: ఇండియా వన్డే టీమ్ కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించే అవకాశం ఉందని వస్తున్న వార్తలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఊహాగానాలే అని, కెప్టెన్సీ విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ తర్వాత వన్డేలకు అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించే రేసులో ఉన్నాడంటూ నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. రోహిత్ పై కెప్టెన్సీ భారాన్ని తగ్గించాలని బీసీసీఐ భావిస్తోందని కూడా పేర్కొన్నాయి.
వీటిపై సైకియా శుక్రవారం స్పందించాడు. ‘ఈ విషయాన్ని నేను ఇప్పుడే వింటున్నా. వన్డే కెప్టెన్సీ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు’ అని స్పష్టం చేశారు. కాగా, ఆసియా కప్ టీ20 టోర్నీకి అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయ్యర్ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే, ఐపీఎల్‌లో 17 ఇన్నింగ్స్‌ల్లో 50.33 సగటుతో 604 రన్స్ సత్తా చాటాడు. ఇంత బాగా ఆడుతున్నా ఆసియా కప్ జట్టులో శ్రేయస్‌కు చోటు దక్కకపోవడం చర్చకు దారి తీసింది.