వయసును గుర్తించేందుకు స్క్రీనింగ్‌‌ ఏజెన్సీ!

వయసును గుర్తించేందుకు స్క్రీనింగ్‌‌ ఏజెన్సీ!
  •     ఏజ్‌ ఫ్రాడ్‌ను అరికట్టేందుకు సెటప్‌‌ చేయనున్న బీసీసీఐ

న్యూఢిల్లీ: ఏజ్‌‌ ఫ్రాడ్‌‌ను అరికట్టేందుకు బీసీసీఐ చర్యలు ముమ్మరం చేసింది. ప్లేయర్ల వయసును కచ్చితంగా నిర్ధారించేందుకు ప్రత్యేకంగా ఓ స్క్రీనింగ్‌‌ ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రముఖ సంస్థల నుంచి ప్రతిపాదలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌‌ను జారీ చేసింది. ఈ నెల చివరి నాటికి ఈ ఏజెన్సీని అందుబాటులోకి తీసుకు రావాలని బోర్డు భావిస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా ప్లేయర్లు సమర్పించే తప్పుడు ధ్రువ పత్రాలను నిశితంగా పరిశీలించాలని మాత్రం యోచిస్తోంది. దాంతో ఆధిక వయసు ప్లేయర్లను ఈ వ్యవస్థలోకి రాకుండా అడ్డుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బీసీసీఐ రెండు రకాల ధ్రువీకరణ వ్యవస్థను అమలు చేస్తోంది. 

ఒకటి బర్త్‌‌ సర్టిఫికేట్‌‌, రెండోది బోన్‌‌ టెస్ట్‌‌ (టీడబ్ల్యూ3). బాలురకు అండర్‌‌-16, బాలికలకు అండర్‌‌-15 స్థాయిలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్యాక్‌‌ గ్రౌండ్‌‌ వెరిఫికేషన్‌‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న సంస్థలు బిడ్డింగ్‌‌ చేయొచ్చు. ఆసక్తిగల పార్టీలు దేశ వ్యాప్తంగా నెట్‌‌వర్క్‌‌, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భౌతికంగా, డిజిటల్‌‌గా ధ్రువీకరణలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మల్టిఫుల్‌‌ డాక్యుమెంట్లను పరిశీలించే సత్తా ఉండాలి. ఆధార్‌‌, పాస్‌‌పోర్ట్‌‌, ఓటర్ ఐడీ కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోకి వ్యక్తిగతంగా వెళ్లి బర్త్‌‌ సర్టిఫికేట్‌‌, స్కూల్ రికార్డ్స్‌‌, అడ్రెస్‌‌, అకడమీక్‌‌ రికార్డ్స్‌‌ను  చెక్‌‌ చేయాలి. ప్రతి రాష్ట్రం నుంచి బాలుర, బాలికల విభాగంలో 40, 50 మంది ప్లేయర్లను ఈ పరీక్షల ద్వారా పంపిస్తారు.  ప్రాసెస్‌‌లో ప్రొఫెషనలిజమ్‌‌ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మొత్తం స్క్రీనింగ్‌‌ను బీసీసీఐ అంతర్గతంగా నిర్వహించనుంది.