
న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్‌లో పాతుకుపోయిన మెగాస్టార్ కల్చర్‌కు ఇక నుంచి చెక్ పడనుందా? దీన్ని తొలగించేందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేస్తున్న ప్రయత్నాలకు మహ్మద్ సిరాజ్ పెర్ఫామెన్స్ ఓ అవకాశంగా మారిందా? అంటే అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్ 2–2తో డ్రా కావడంతో గంభీర్, అగార్కర్ ఇప్పుడు స్టార్ కల్చర్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. వర్క్ లోడ్‌ను సాకుగా చూపి ఎంపిక చేసుకున్న సిరీస్‌ల్లోనే ఆడే సాంప్రదాయాన్ని కూడా తుడిచి పెట్టాలని భావిస్తున్నారు. వ్యక్తుల ఆధారంగా నెలకొన్న జట్టు సంస్కృతిని రూపుమాపి అందరూ సమానమనే ఏకరీతి సంస్కృతికి నాంది పలికేందుకు సిద్ధమవుతున్నారు.
‘వర్క్ లోడ్‌పై ఇప్పటికే చర్చలు జరిగాయి. ఇక నుంచి మ్యాచ్, సిరీస్‌లను ఎంచుకోవడం కుదరదని సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ప్లేయర్లకు క్లియర్‌గా మెసేజ్ వెళ్తుంది. సమీప భవిష్యత్‌లో దీన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరు. పని భారం విండోను పూర్తిగా తీసేస్తామని దీని అర్థం కాదు. మరింత నిష్పాక్షికమైన విధానాన్ని అనుసరిస్తాం. పేసర్లకు వర్క్ లోడ్ ఉంటుంది. కానీ దాని పేరుతో కీలకమైన మ్యాచ్‌లను వదిలేస్తామంటే కుదరదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు. ఐదు టెస్ట్‌ల్లో 185.3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ గత ఆరు వారాల్లో ఫీల్డింగ్ చేసిన గంటలు, నెట్స్‌లో వేసిన ఓవర్లన్నీంటిని పరిగణనలోకి తీసుకుంటే అతని మ్యాచ్ ఫిట్‌నెస్ ఎలా ఉందో మిగతా వాళ్లకు చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నాడు.
టీమ్ కంటే గొప్పోళ్లు ఎవరు లేరని సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ నిరూపించారన్నాడు. స్టార్ పేసర్ బుమ్రా ఐదు టెస్ట్‌ల పని భారాన్ని భరించలేకపోవడంపై బీసీసీఐ అధికారులతో పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పని చేస్తున్న స్పోర్ట్స్ సైన్స్ జట్టు సామర్థ్యంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది. నెల రోజుల విరామం తర్వాత సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరిగే ఆసియా కప్ కు బుమ్రా అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు.
బుమ్రా ఆసియా కప్‌లో ఆడితే అక్టోబర్ 2న విండీస్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే నవంబర్‌లో సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఆడతాడు. నితిన్ పటేల్ నిష్క్రమణ తర్వాత సీఓఈ.. స్పోర్ట్స్ సైన్స్ టీమ్‌కు కొత్త హెడ్‌ను నియమించే అవకాశం ఉంది. కాబట్టి పేసర్లు మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడగలరనే భావన ఉంది.