ముంబై: ఎన్నాళ్లుగానో టీ20 లీగ్ కోసం ఎదురుచూస్తున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సీజన్ (2023) నుంచి ఆరు టీమ్స్ తో పూర్తి స్థాయిలో విమెన్స్ ఐపీఎల్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని ప్రకటించింది. ఈ సీజన్ లో మాత్రం మూడు టీమ్స్ మధ్య నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడతాయని తెలిపింది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘పూర్తి స్థాయిలో ఐపీఎల్ కోసం ఏజీఎం అనుమతి ఇవ్వాల్సి ఉంది. వచ్చే ఏడాది ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నా’ అని గంగూలీ పేర్కొన్నాడు. అలాగే వచ్చే ఐదేళ్ల కాలానికి (2023–27 ) ఐపీఎల్ మీడియా హక్కుల గురించి కూడా ఈ మీటింగ్ లో చర్చించారు. త్వరలో ఇందుకోసం టెండర్లు పిలుస్తామని ఓ అధికారి అన్నారు. రిలయన్స్, హాట్ స్టార్, సోనీ, అమెజాన్ ఈ హక్కులు దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్‌లో ప్రస్తుత ఫ్రాంచైజీలకు.. విమెన్స్ ఐపీఎల్‌లో టీమ్స్ కొనుగోలు చేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇప్పటికే మూడు ఫ్రాంచైజీలు ఇందుకు రెడీ ఉన్నట్టు తెలుస్తోంది.

