సమ్మర్ స్పెషల్:తాజా పండ్లతో.. వెరైటీ టేస్టీ కోసం స్మూతీలు

సమ్మర్ స్పెషల్:తాజా పండ్లతో.. వెరైటీ టేస్టీ కోసం స్మూతీలు

తాజా పండ్లు చూస్తే ఎప్పుడెప్పుడు తిందామా? అనిపిస్తుంటుంది. వేసవిలో అయితే రకరకాల పండ్లను ఇంటికి తెచ్చేస్తుంటారు. ఆ పండ్లను నేరుగా తినడమే కాకుండా జ్యూస్​ల్లా తయారుచేసుకోవడం తెలిసిందే. అయితే, ఇంకాస్త వెరైటీ టేస్ట్ కోసం ఫ్రూట్స్​తో ఇలా స్మూతీలు చేసుకుంటే పిల్లలతో సహా ఇంట్లో అందరికీ ఫేవరేట్ అయిపోతాయి.మరింకేం.. వీటి తయారీ ఎలాగో చదివేసి, చేసేయండి.  

పైనాపిల్

కావాల్సినవి :
పైనాపిల్ ముక్కలు, కొబ్బరిపాలు - ఒక్కో కప్పు
కర్జూరలు - రెండు, పాలు - అర కప్పు
వెనీలా ఎసెన్స్ - పావు టీస్పూన్
డ్రైఫ్రూట్స్ తరుగు - కొంచెం

తయారీ :
కొబ్బరి పాలను ఐస్​ ట్రేలో పోసి ఫ్రిజ్​లో పెట్టాలి. అవి గడ్డ కట్టాక తీసి మిక్సీజార్​లో వేయాలి. వాటితోపాటు పైనాపిల్ ముక్కలు, కర్జూరలు, వెనీలా ఎసెన్స్ వేసి పాలు పోసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గ్లాస్​లో పోసుకుని, పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటే సరి.

ఆపిల్

కావాల్సినవి :
ఆపిల్ - ఒకటి
బాదం, జీడిపప్పులు - రెండేసి చొప్పున
యాలక - ఒకటి 
పాలు - ఒక కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు

తయారీ :
ఒక చిన్న గిన్నెలో బాదం, జీడిపప్పులు, కుంకుమ పువ్వు వేసి పాలు పోసి నానబెట్టాలి. తొక్క తీసిన ఆపిల్ ముక్కలను మిక్సీజార్​లో వేసి నానబెట్టిన డ్రైఫ్రూట్స్, యాలక వేసి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గ్లాసులో పోసి పైన ఇంకాస్త డ్రైఫ్రూట్స్ తరుగు చల్లాలి. తీపి కోసం కావాలంటే డేట్స్ లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. 

బొప్పాయి

కావాల్సినవి :
బొప్పాయి - ఒకటి
ఓట్స్ - రెండు టేబుల్ స్పూన్లు
అవిసె గింజలు - ఒక టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూన్
వెనీలా ఎసెన్స్ - పావు టీస్పూన్ 
సోయా మిల్క్ - ఒకటిన్నర కప్పు

తయారీ :
మిక్సీజార్​లో బొప్పాయి ముక్కలు, ఓట్స్, అవిసె గింజలు, దాల్చిన చెక్క పొడి, వెనీలా ఎసెన్స్ వేసి సోయా మిల్క్ పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే... ఎంతో టేస్టీగా ఉండే స్మూతీ రెడీ. ఈ హెల్దీ రెసిపీ అస్సలు మిస్​ కావొద్దు.