April 1 : అయ్యో పాపం.. ఆ తేదికి ఎంత కష్టవచ్చింది..సెలబ్రేషన్స్ డే కాస్త ఫూల్స్డే అయింది..! 

April 1 : అయ్యో పాపం.. ఆ తేదికి ఎంత కష్టవచ్చింది..సెలబ్రేషన్స్ డే కాస్త ఫూల్స్డే అయింది..! 

పాపం ఏప్రిల్ ఫస్టుని చూస్తే జాలేస్తుందబ్బా. బళ్లు ఓడలూ, ఓడలు బళ్లు అవుతాయనే సామెత ఉంది. కదా..! ఆ సామెతకి న్యాయం చెయ్యటానికే ఓ రోజు ఉన్నట్టు, ఆ సామెతకి బ్రాండ్ అంబాసిడర్ ఏప్రిల్ ఫస్ట్ అన్నట్టు అనిపిస్తుంది.పాపం ఒకప్పుడు అది న్యూ ఇయర్ డే' లాగా ఓ వెలుగు వెలిగింది. నువ్వే కింగ్, సువ్వే తోపు' అంటే పొంగిపోయింది. తర్వాత ఆ పోస్టు జనవరి ఫస్టుకి ఇచ్చేశాం. సువ్విప్పుడు మామూలు డే' అంటే సైలెంట్ ఒప్పుకొని పదవి దిగిపోయింది.

రోజులు బాగా లేక కామెడీ వేషాలకు దిగిన ఈ పాత హీరోలా మారినా తనకంటూ ఓ రోజుంది కదా అని సరిపెట్టుకుంది. అలా  శతాబ్దాల కాలం పాటు జనాన్ని విపరీతంగా నవ్విస్తూ నవ్వుతూ ఏప్రిల్ ఫస్ట్ ఈజ్ స్పెషల్ డే' అన్న గౌరవం దక్కించుకొని జనవరి ఫస్ట్​ ను  చూసి కాలరు ఎగరేసింది. అసలు పాజిటివ్ థింకింగ్​ కు  ఒక పెద్ద ఉదాహరణ ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు జీవితమే అనిపిస్తోందికదా. అలా సర్దుకుపోతూ అలా ఇలా కొన్ని సెంచరీలు గడిపేసింది. 

అది అలా ఉన్నా బావుండు, పుండు మీద కారం చల్లినట్టు కనీసం మామూలు రోజులా కూడా మిగలనివ్వకుండా దాన్ని కాస్తా పూల్స్ డే గా మార్చి పడేశారు జనవరి వాదులు, పాపం ఎంతగా కుంగిపోయిందో ఏమోగానీ, ఆ కొత్త పేరుని కూడా ఒప్పేసుకొని 'ప్రాక్టికల్ జోకర్స్ డే' అని అనధికారికంగా అలా బతికేస్తోంది.

అంతే పాపం! నాటకంలో ఈ ఏప్రిల్ పస్ట్​ జీవితం మరింత దిగజారిపోయింది.ఎంతైనా ఒకప్పడు బాగా బతికిన రోజు కదా. ఎలాగో ఒకలాగా వైభవాన్ని నిలబెట్టుకుందామనే ట్రై చేస్తోంది కానీ పాపం.. రోజు రోజుకీ పరిస్థితి దిగజారిపోతోంది. ఫూల్స్ అనగానే ప్రతి ఒక్కరిలో ఒక చిన్నపిల్లాడు బయటకు వచ్చేస్తాడు. సరదాగా అందరినీ పూల్ చేయడం కోసం ఏదేదో గాలి వార్తలు చెబుతుంటారు. విన్నవాళ్లు అది నమ్మితే ఏప్రిల్ ఫూల్ అంటూ గట్టిగా నవ్వేస్తారు.

ఎక్కడ చూసినా ఆ రోజంతా ఇవే సరదాలు. ఆనందాలు, నవ్వులు. పిల్లలైతే ముందురోజునుంచే ఫోన్ చేసేవా ళ్ళు అయితే అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెలితే.. అవి 1582 కంటే ముందు రోజులు. యూరప్ జనాలంతా మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు.

పాత సంవత్సరానికి ఏప్రిల్ ఒకటి విడుదల అంటూ కొత్తసంవత్సరం ఏప్రిల్ ఒకటి వెల్​ కమ్ చెప్పుకునేవాళ్లు. కానీ ఇందాకే చెప్పుకున్నట్లు నాటకాల పిచ్చి ఉన్న విధి... కొత్త స్క్రీన్ ప్లే రాసుకొని వచ్చేసింది. అంతే.. స్టోరీ మారిపోయి 1582లో మాత్రం జూలియన్ క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రెగర్ ఓ కొత్త క్యాలెండరిని విడుదల చేశాడు. దాని ప్రకారం ఏప్రిల్ ఒకటి పదవి ఊడిపోయి జనవరి ఒకటికి నడమంత్రపు సిరి విచ్చేసింది.

అలా విషాదంగా పూల్స్​డే అనే కామెడీ రోజు పుట్టిందన్నమాట.."ఏయ్! నీ వెనకాల పాముంది" అనో, "నీ ప్యాంటు చినిగింది" అనో అరచి సవదరు అమాయకుడు అది నమ్మి అటూ ఇటూ చూసుకోగానే "హే! ఏప్రిల్ పూల్!!" అని నవ్వే పిల్లల కాలం అయిపోయింది..

అక్కడెక్కడో స్వాగెట్టీ (నూడిల్స్​) పంట కోతలు జరుగుతున్నాయని బీబీసీలాంటి మీడియా దిగ్గజం ఓ న్యూస్ వేసి జనాలని సామూహిక పిచ్చి మాలోకాలని" చేసే రోజులూ అయిపోయాయి. పాపం ఈ ఏడు తల్లీ నిరుడు కురిసిన నవ్వు సమూహములు? అని బిక్క మొహం వేసుకునే మామూలు రోజుల్లాగే ఏప్రిల్ మొదటి రోజూ మారిపోయింది..

విధి ఆడిన కొత్త వింత నాటకంలో పాపం మళ్లీ ఈ ఏప్రిల్ ఫస్ట్​ దారుణంగా దెబ్బ తిన్నది. ప్రపంచం మీదకి ఇంటర్ నెట్ అని ఒకటి వచ్చి పడి దానిలో యూట్యూబ్ అని ఓ వీడియోల ప్రపంచం ఏడ్చేసరికి అది కాస్తా ఏపిల్ పస్టు చావుకొచ్చింది.

ఇప్పుడు ప్రతీరోజూ పూల్స్​ డే..నే..  ఒకడు వీడియో ప్రాంక్' అని రోడ్డు మీడ అడ్డమైన పిచ్చి వేషాలు వేసి జనాలని ఫూల్ చేయటమే ప్రొఫెషన్ అన్నట్టు బతుకుతారు. ఇంకొకడు ఇలా చేస్తే షాకే' అని నోటికొచ్చిన వాయిస్ ఓవర్ తో చేతికొచ్చిన థంబ్​ నెయిల్స్ తో అప్​ లోడ్ చేస్తాడు. తీరా ఓపెన్ చేస్తే ఏ షాకూ ఉండదు. మనం ఫూల్స్ అయ్యాం అని అర్ధమవుతుంది.

ఇక టీవీ సీనియల్స్ చూపించే అద్భుతా లకీ అసలు జనాలు నిజంగా మేం ఉత్త ఎర్రిమా లోకాలమ్' అని ఫిక్స్ అయిపోయేలా ఉన్నారు. రోజూ ఇన్ని రకాలుగా పూర్తి అవుతున్నాక, ఇక స్పెషల్ గా ఫూల్స్ డే అవసరం ఏముంది. చెప్పండి!'చిత్రలహరి, మీరు కోరిన పాటలు' లాంటి ప్రోగ్రాముల్లాగానే నాటి మధుర జ్ఞాపకాల్లో ఏప్రిల్ ఫూల్స్ డే కూడా చేరిపోయేలాగుంది.ఏంటో, అంతరించిపోయే జీవజాతుల్లాగా, అంతరించిపోయే దినాలు కూడా ఉంటాయన్నమాట.