తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 77పై థియేటర్ యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో నిర్మాతలకు అనుకూలంగా ఏకపక్షంగా ఉందని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆరోపించింది. దీనిని వెంటనే పునఃసమీక్షించి సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. ఈ మేరకు సీఎంకు లేఖ రాయడంతో టాలీవుడ్‌లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
33 జిల్లాల్లోని 400కుపైగా థియేటర్లను సంప్రదించకుండానే జీవో తీసుకురావడం ఏంటని ఎగ్జిబిటర్లు ప్రశ్నించారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో చర్చించకుండా.. తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, కొందరు నిర్మాతల విజ్ఞప్తి ఆధారంగా టికెట్ ధరలు నిర్ణయించడం సరికాదని మండిపడ్డారు. మరోవైపు టైర్-2, టైర్-3 పట్టణాల్లో దాదాపు 99 శాతం ఎయిర్ కూల్డ్ థియేటర్లే ఉన్నాయని తెలిపారు. కోవిడ్ తర్వాత ప్రేక్షకులకు మెరుగైన అనుభూతి అందించేందుకు ఎగ్జిబిటర్లు భారీగా పెట్టుబడులు పెట్టారని గుర్తుచేశారు. రిక్లైనర్లు, డాల్బీ అట్మాస్ వంటి సదుపాయాల కోసం ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.
థియేటర్ల నిర్వహణ భారం మొత్తం ఎగ్జిబిటర్లపైనే ఉందని, సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్, ఆక్యుపెన్సీ రిస్క్ అన్నీ తామే భరిస్తున్నామని అసోసియేషన్ స్పష్టం చేసింది. నిర్వహణ ఖర్చులు ఇప్పటికే 25 నుంచి -30 శాతం పెరిగాయని తెలిపింది. ఎయిర్ కూల్డ్ థియేటర్లను తప్పనిసరిగా ఏసీ థియేటర్లుగా మార్చాలన్న నిబంధన చిన్న పట్టణాల్లో మరింత భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క స్క్రీన్‌ను ఏసీగా మార్చేందుకు రూ.60 నుంచి -80 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఈ భారం తట్టుకోలేక మరిన్ని సింగిల్ స్క్రీన్లు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది..
టికెట్ ధరలు పెరిగినా ఎగ్జిబిటర్లకు ప్రయోజనం లేకపోతే ఈ నిర్ణయానికి అర్థమేంటి? అంటూ అసోసియేషన్ ప్రశ్నించింది. సినీ పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేసింది. గ్రామీణ తెలంగాణలో థియేటర్ల మనుగడ.. వేల కుటుంబాల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని జీవో 77ను సవరించాలని కోరింది.
