IND vs ENG 2025: టీమిండియాతో చివరి టెస్టుకు స్టోక్స్ దూరం.. నాలుగు మార్పులతో ఇంగ్లాండ్

IND vs ENG 2025: టీమిండియాతో చివరి టెస్టుకు స్టోక్స్ దూరం.. నాలుగు మార్పులతో ఇంగ్లాండ్

టీమిండియాతో జరగనున్న చివరిదైన ఐదో టెస్టుకు ఇంగ్లాండ్ క్రికెట్ బుధవారం (జూలై 30) తమ తుది జట్టును ప్రకటించింది. భుజం గాయం కారణంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. స్టోక్స్ స్థానంలో ఓలీ పోప్ ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్ కు కెప్టెన్సీ చేయనున్నాడు. గురువారం (జూలై 31) లండన్ వేదికగా ది ఓవల్‌లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ ప్రారంభం కానుంది. చివరి టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 లో ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతుంది. గాయపడిన స్టోక్స్ స్థానంలో బ్యాటింగ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. 

ఇండియాతో మాంచెస్టర్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో ఘోరంగా విఫలమైన స్పిన్నర్ లియామ్ డాసన్ పై వేటు పడింది. ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడాన్ కార్స్ లకు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జామీ ఓవర్టన్‌లు ప్లేయింగ్ 11 లో స్థానం సంపాదించారు. ఓవల్ లో జరగబోయే ఐదో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ నలుగురు స్పెసలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం 4 టెస్ట్ మ్యాచ్ లు జరగగా ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. మరోవైపు ఇండియా విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే 2-1 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకుంటుంది.

స్టోక్స్ కు భుజం గాయం:

మాంచెస్టర్ వేదికా ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఇండియాతో జరిగిన నాలుగో టెస్టులో స్టోక్స్ భుజం గాయంతో ఇబ్బంది పడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్ లో 11 కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. నాలుగో టెస్టులో తన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 6 వికెట్లు తీయడంతో పాటు తొలి ఇన్నింగ్స్ లో 141 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు భారీ ఆధిక్యాన్ని సంపాదించాడు. స్టోక్స్  లేకపోవడంతో ఇంగ్లాండ్ ఎలా రాణిస్తుందో అనే విషయం ఆసక్తికరంగా మారింది.

భారత్‌తో జరిగే ఐదో టెస్ట్‌కు ఇంగ్లాండ్ తుది జట్టు: 

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్