721 పాయింట్లు అప్‌‌..రికవరీ బాటలో సెన్సెక్స్‌‌

721 పాయింట్లు అప్‌‌..రికవరీ బాటలో సెన్సెక్స్‌‌

ముంబై: గత నాలుగు సెషన్లలో 4 శాతం మేర నష్టపోయిన బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సోమవారం  లాభపడ్డాయి. ఐటీ, రిలయన్స్, ఇతర హెవీ వెయిట్ ఇండెక్స్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌‌, నిఫ్టీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. 30 షేర్లున్న సెన్సెక్స్ 721 పాయింట్లు (1.20 శాతం) పెరిగి 60,566 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్‌‌ 989 పాయింట్ల వరకు  లాభపడింది.  నిఫ్టీ 2‌‌‌‌08 పాయింట్లు ర్యాలీ చేసి 18,000 లెవెల్‌‌ పైన అంటే 18,014 వద్ద సెటిలయ్యింది. సెన్సెక్స్‌‌లో ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌, ఎస్‌‌బీఐ, టాటా స్టీల్‌‌, బజాజ్ ఫిన్సర్వ్‌‌, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.  నెస్లే, కోటక్ బ్యాంక్‌‌, ఎయిర్‌‌‌‌టెల్‌‌, హెచ్‌‌సీఎల్‌‌ టెక్ షేర్లు నష్టపోయాయి. కిందటి వారం భారీగా పడిన ఇండెక్స్‌‌లు  సోమవారం రికవరీ అయ్యాయని మోతీలాల్‌‌ ఓస్వాల్‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్దార్ధ్ ఖేమ్కా అన్నారు.  

ఎటువంటి  మేజర్ ఈవెంట్స్‌‌ లేకపోవడంతో పాటు, హాలిడేస్ ఉండడంతో మార్కెట్‌‌   రేంజ్ బౌండ్‌‌ నుంచి పాజిటివ్‌‌గా కదులుతుందని అన్నారు.  వరుసగా నాలుగు సెషన్లలో  పతనమైన మార్కెట్‌‌లో క్వాలిటీ షేర్ల కోసం వేట మొదలయ్యిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్  పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి సపోర్ట్ దొరకడంతో  మార్కెట్‌‌లు సోమవారం లాభపడ్డాయని అన్నారు. ప్రభుత్వ బ్యాంకులు, మిడ్‌‌, స్మాల్ క్యాప్ షేర్లు బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌ల కంటే ఎక్కువగా పెరిగాయని వివరించారు. గ్లోబల్‌‌గా రెసిషన్ భయాలు, కరోనా కేసులు విస్తరించడం వంటి ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని, మార్కెట్ హై వోలటాలిటీలో కదులుతుందని అంచనావేశారు. బ్రాడ్ మార్కెట్ చూస్తే, బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ 3.13 శాతం, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 2.31 శాతం లాభపడ్డాయి. సెక్టార్ల పరంగా చూస్తే, యుటిలిటీస్‌‌, పవర్‌‌‌‌, రియల్టీ, కమొడిటీస్‌‌, ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌, టెలికమ్యూనికేషన్‌, బ్యాంకెక్స్ ఇండెక్స్‌‌లు ఎక్కువగా పెరిగాయి. హెల్త్‌‌కేర్‌‌‌‌ సెక్టార్ మాత్రం నష్టపోయింది. బ్రెంట్ క్రూడ్‌‌ సోమవారం 3.63 శాతం లాభపడి బ్యారెల్‌‌కు 83.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.