కేటాయించి ఏడు నెలలవుతున్నా.. డబుల్​ ఇండ్లెందుకు ఇస్తలేరు?

కేటాయించి ఏడు నెలలవుతున్నా.. డబుల్​ ఇండ్లెందుకు ఇస్తలేరు?
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఆర్డీవో ఆఫీసు ముందు లబ్ధిదారుల ఆందోళన

హుస్నాబాద్​, వెలుగు :  డబుల్​ బెడ్​రూమ్ ​ఇండ్లు కేటాయించి ఏడు నెలలు కావస్తున్నా ఇవ్వకపోవడంతో పలువురు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఆర్డీవో ఆఫీసు ముందు ధర్నా చేశారు. డబుల్​ బెడ్​రూమ్​ఇండ్ల కోసం డ్రా తీసి ఏడు నెలలైనా ఇండ్లు ఎందుకు ఇస్తలేరో ఆఫీసర్లు చెప్పాలని డిమాండ్​ చేశారు. సొంత ఇండ్లు లేకపోవడంతో అద్దె ఇండ్లలో ఉంటున్నామని, నెలనెలా కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లను అడిగినా సమాధానం చెప్పడంలేదన్నారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తామంటే లీడర్లు అడ్డుకుంటున్నారన్నారు.

వైఎస్సార్​టీపీ హుస్నాబాద్​ నియోజకవర్గ కో ఆర్డినేటర్​అయిలేని మల్లికార్జునరెడ్డి, కిసాన్​సంఘ్​జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్​రెడ్డి, బీసీ సంఘం​నాయకుడు రవీందర్​వచ్చి బాధితులకు మద్దతుగా ఆందోళన చేశారు. లబ్ధిదారులకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఎందుకు ఇవ్వడంలేదో ఆర్డీవో వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. అప్పటిదాకా కదిలేది లేదన్నారు. ఆర్డీవో రాకపోవడంతో తహసీల్దార్​కు వినతిపత్రాన్ని ఇచ్చారు. రెండు రోజుల్లో లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించి వెళ్లిపోయారు.