సైబర్ మోసాల నుంచి రక్షించడానికి టోకనైజేషన్ ​విధానం

సైబర్ మోసాల నుంచి రక్షించడానికి టోకనైజేషన్ ​విధానం

న్యూఢిల్లీ: దేశమంతటా ఈ నెల నుంచి డెబిట్ కార్డ్,  క్రెడిట్ కార్డ్​లతో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్లకు సంబంధించిన నియమాలు మారుతాయి. కస్టమర్లు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఆన్‌‌‌‌లైన్ షాపింగ్ లేదా మర్చంట్ సైట్‌‌‌‌లలో స్టోర్ చేసినప్పుడు జరిగే సైబర్ మోసాల నుంచి వారిని రక్షించడానికి టోకనైజేషన్ ​విధానాన్ని తెచ్చారు. దేశీయంగా ఆన్‌‌‌‌లైన్ కొనుగోళ్లకు వర్తించే కార్డ్-ఆన్-ఫైల్ (సీఓఎఫ్​) టోకనైజేషన్‌‌‌‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. కార్డ్ టోకనైజేషన్‌‌‌‌కు దేశవ్యాప్తంగా గడువును ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 1 2022 వరకు.. అంటే ఆరు నెలల పాటు పొడిగించారు. కస్టమర్లకు మూడోసారి అవకాశం ఇవ్వడానికి అక్టోబర్ 1 వరకు గడువు ఇచ్చారు.

కార్డ్ టోకనైజేషన్ అంటే ఏమిటి?

ఎలాంటి ఇబ్బందులూ లేకుండా డబ్బులు చెల్లించేందుకు మీ కార్డ్‌‌‌‌లను ‘టోకనైజ్’ చేయాలంటూ ఆన్‌‌‌‌లైన్ మర్చంట్లు,  బ్యాంకులు మీకు ఇదివరకే నోటిఫికేషన్‌‌‌‌లు పంపించి ఉంటాయి. ప్రతి వెబ్‌‌‌‌సైట్, మర్చంట్​ లేదా పేమెంట్ గేట్‌‌‌‌వేలో అన్ని డెబిట్​, క్రెడిట్ కార్డ్‌‌‌‌లకు ప్రత్యేక కోడ్​ను కేటాయిస్తారు. దీనిని టోకెన్ అంటారు. మీరు మీ కార్డ్‌‌‌‌ని ఉపయోగించే ప్రతి వెబ్‌‌‌‌సైట్ లేదా ప్లాట్‌‌‌‌ఫారమ్ లేదా యాప్ కోసం ఇది క్రియేట్ అవుతుంది. ఆర్​బీఐ వెబ్‌‌‌‌సైట్ ప్రకారం, “టోకెనైజేషన్ అనేది “టోకెన్” అని పిలిచే ప్రత్యామ్నాయ కోడ్‌‌‌‌తో వర్చువల్​ కార్డ్ వివరాలను భర్తీ చేస్తుంది. ఇది కార్డ్, టోకెన్ రిక్వెస్టర్​ (అంటే టోకనైజేషన్ కోసం కస్టమర్ నుంచి అభ్యర్థనను అంగీకరించే సంస్థ) కలయిక కోసం ప్రత్యేకంగా ఉంటుంది. సంబంధిత సంస్థ ఒక కార్డుకు టోకెన్‌‌‌‌ను జారీ చేయాలని కోరుతూ కార్డ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌కు రిక్వెస్ట్​ పంపుతుంది.  వెంటనే కరస్పాండెంట్​ టోకెన్​ వస్తుంది. ఆన్‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లలో పేమెంట్లు చేయడానికి ఉపయోగించే మీ క్రెడిట్,  డెబిట్ కార్డ్‌‌‌‌లకు ఇది అదనపు సెక్యూరిటీ లేయర్​గా ఉంటుందని అర్థం. అంటే అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, పేటీఎం, మింత్రా వంటి ఆన్‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లు ఇక నుంచి మీ కార్డ్ వివరాలను సేవ్ చేసుకోలేవు.

మీరు మీ కార్డ్‌‌‌‌ని టోకనైజ్ చేయకపోతే ఏమవుతుంది?

డెబిట్ కార్డ్  క్రెడిట్ కార్డ్ టోకనైజేషన్  తప్పనిసరి కాదు.  కస్టమర్ తన కార్డ్‌‌‌‌ని టోకనైజ్ చేయాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. టోకనైజేషన్ లేకుంటే ఇక నుంచి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు  కార్డ్ వివరాలను మళ్లీ నమోదు చేయాలి. టోకనైజేషన్ సిస్టమ్ పూర్తిగా ఉచితం. ఇది మీ డేటాను భద్రపరుస్తుందని గుర్తుంచుకోవాలి. దేశీయ ఆన్‌‌‌‌లైన్ లావాదేవీలకు మాత్రమే టోకనైజేషన్ వర్తిస్తుంది. టోకనైజేషన్ అభ్యర్థన కోసం రిజిస్ట్రేషన్ అనేది ‘అడిషనల్​ ఫ్యాక్టర్​అథెంటికేషన్ ’(ఏఎఫ్​ఏ) ద్వారా కస్టమర్ సమ్మతితో మాత్రమే చేస్తారు.   డిఫాల్ట్ / ఆటోమేటిక్ చాయిస్​ ద్వారా ఈ పనిపూర్తి కాదు. క్రెడిట్​ లిమిట్స్​ను కూడా పెట్టుకొనే అవకాశం కస్టమర్​కు ఉంటుంది.

ఈ సాధారణ స్టెప్​లను అనుసరించడం ద్వారా క్రెడిట్ కార్డ్  డెబిట్ కార్డ్ టోకనైజేషన్ చేయవచ్చు:

స్టెప్​ 1: ఆహారం, కిరాణా లేదా దుస్తులతో సహా వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఇష్టమైన లేదా ఎక్కువగా ఉపయోగించే ఆన్‌‌‌‌లైన్ వెబ్‌‌‌‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్‌‌‌‌కు వెళ్లి, ఆపై లావాదేవీని మొదలుపెట్టండి

స్టెప్​ 2: ఇది చెక్అవుట్ పేజీకి వెళ్లినప్పుడు, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ పేమెంట్ చాయిస్​ను ఎంచుకోండి. ఇప్పుడు సీవీవీ నంబరును అందించండి.

స్టెప్​ 3: “మీ కార్డ్‌‌‌‌ని సెక్యూర్​ చేసుకోండి” లేదా “ఆర్​బీఐ మార్గదర్శకాల ప్రకారం కార్డ్‌‌‌‌ను సేవ్ చేయండి” అని పేర్కొనే ఆప్షన్‌‌‌‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 4: సేవ్‌‌‌‌పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్‌‌‌‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.

స్టెప్​ 5: మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఇప్పుడు  టోకనైజ్ అయింది. అంటే కార్డు వివరాలు  సురక్షితంగా ఉంటాయి. వ్యాపారులు ఇకపై మీ కార్డుల సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు.