తెల్లారి 3 గంటలకే చీరల కొట్టు ముందు క్యూలో లేడీస్.. నిద్రలు మానుకుని మరీ ఎందుకమ్మా అని అడిగితే..

తెల్లారి 3 గంటలకే చీరల కొట్టు ముందు క్యూలో లేడీస్.. నిద్రలు మానుకుని మరీ ఎందుకమ్మా అని అడిగితే..

తెల్లవారుజామున 3 గంటలకు, 4 గంటలకు బిర్యానీలు తినే సిటీ జనాన్ని చూసే ఉంటారు. సిటీల్లో ప్రస్తుతం ఇదో వేలం వెర్రి.. మిడ్ నైట్ బిర్యానీ, లేట్ నైట్ బిర్యానీ, 3 am బిర్యానీ, 4 am బిర్యానీ.. ఇలా రకరకాల పేర్లతో సిటీ జనం మిడ్ నైట్ నుంచి వేకువ జాము వరకూ బిర్యానీలను ఆవురావురమని లాగించేస్తుంటారు. ఈ ట్రెండ్ అందరికీ తెలిసిందే. కానీ.. చీరల కోసం వేకువ జామున 3 గంటలకు షాపింగ్ మాల్ దగ్గర పడిగాపులు కాస్తున్న పబ్లిక్ను మీరెప్పుడైనా చూశారా..? ఈ తరహా జనాన్ని బెంగళూరులో మీరు చూడొచ్చు. ఒక యువతి ఇన్స్టాగ్రాం సాక్షిగా ఈ విషయాన్ని బయటపెట్టింది.

తెల్లవారుజాము నుంచి కాదు ముందు రోజు రాత్రి నుంచి ఆ షాపింగ్ మాల్ ముందు కార్లలో పడుకుని మరీ ఆ చీరల దుకాణం ఉదయం తెరిచే వరకూ వేచిచూస్తున్న పరిస్థితి ఉంది. బెంగళూరులో.. ఒక యువతి తెల్లవారుజామున 4 గంటలకు కేఎస్‌ఐసి మైసూరు పట్టు చీరల దుకాణానికి వెళ్లి.. ఒక చీర కొనడానికి 6 గంటల పాటు క్యూలో నిలబడింది. ఈ వీడియో వైరల్ అయింది. ఈ సమయంలో, ఆ యువతి తన అనుభవాన్ని పంచుకుంటూ, ఈ చీరకు ఎంత క్రేజ్ ఉందో వివరించింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

సదరు యువతి తెల్లవారుజామున బెంగళూరు జయనగర్‌లోని KSIC మైసూర్ సిల్క్స్ స్టోర్‌కు వెళ్లి అక్కడ బయట కనిపించిన దృశ్యాలను రికార్డ్ చేసింది. తాను తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి, మైసూర్ సిల్క్ చీర కోసం క్యూలో నిలబడ్డానని ఆమె చెప్పింది. తెల్లవారుజామున 3- నుంచి 4 గంటల సమయంలో చీరలు కొనడానికి అక్కడకు వెళ్లిన మహిళలు టోకెన్ కోసం గంటల తరబడి వేచి ఉండటాన్ని కూడా యువతి తన వీడియోలో చూపించింది. ఆ తర్వాత, ఆమె కాఫీ కోసం బయటకు వెళ్లి, తిరిగి వచ్చే సరికి.. లిస్ట్లో 53 పేర్లు చేరాయి. షోరూమ్ ముందు క్యూలో నిలబడిన వారితో మాట్లాడగా, ఒక మహిళ తాను తెల్లవారుజామున 3 గంటలకు వచ్చానని చెప్పగా, మరో వ్యక్తి తాను ముందు రోజు రాత్రి 9 గంటలకు వచ్చానని చెప్పాడు.

ALSO READ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 18 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్లు స్వాధీనం 

బెంగళూరు జయనగర్‌లోని KSIC మైసూర్ సిల్క్స్ స్టోర్‌ ఉదయం 10- నుంచి 10.30 గంటల మధ్యలో తెరుచుకుంటుంది. ఒకేసారి 10 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అది కూడా టోకెన్లు తీసుకున్న వాళ్లను మాత్రమే. ఆర్డర్ ప్రకారమే. చీర కొనడానికి వెళ్లిన వాళ్లు కేవలం 10 నిమిషాల్లో చీర సెలెక్ట్ చేసుకోవాలి. ఒక టోకెన్‌కు ఒక చీర మాత్రమే వస్తుంది. ఈ స్టోర్లో మైసూరు పట్టు చీర ధర రూ. 23 వేల నుంచి మొదలవుతుంది. అత్యధికంగా రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది. 

ఎందుకు ఈ  KSIC మైసూర్ సిల్క్స్ స్టోర్‌లో అమ్మే చీరలకు ఇంత క్రేజ్ అంటే.. ఈ స్టోర్లో అమ్మే చీరలు ప్యూర్ పట్టుతో తయారవుతాయి. పట్టు క్వాలిటీ చాలా బాగుంటుందని ఇక్కడ చీరలు కొన్న మహిళలు చెబుతున్నారు. ఈ చీరలను హై క్వాలిటీ మల్బరీ పట్టుతో తయారు చేస్తారని, స్వచ్ఛమైన బంగారు జరీని ఉపయోగించడం వల్ల ఈ స్టోర్లో ధరలు కూడా బంగారం ధరలతో పాటు మారుతూ ఉంటాయని స్టోర్ యజమాని తెలిపారు.