ఉత్తమ చిత్రం రాజు వెడ్స్‌‌ రాంబాయి.. గద్దర్ అవార్డులు-2025 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ఉత్తమ చిత్రం రాజు వెడ్స్‌‌ రాంబాయి.. గద్దర్ అవార్డులు-2025 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  • వివరాలు వెల్లడించిన ఎఫ్‌‌డీసీ చైర్మన్ దిల్ రాజు
  • కమల్ ​హాసన్‌‌కు పైడి జయరాజ్‌‌..చిరంజీవికి ఎన్టీఆర్‌‌‌‌ నేషనల్‌‌ అవార్డు
  • బెస్ట్‌‌ హీరో నాగచైతన్య.. హీరోయిన్‌‌ రష్మిక మందన్నా 
  • అన్ని కేటగిరీల్లో కలిపి 54 మందికి అవార్డులు
  • డిప్యూటీ సీఎంకు అవార్డుల లిస్ట్ అందించిన జ్యూరీ కమిటీ
  • ఉగాది రోజు పురస్కారాలు ప్రదానం చేయనున్న సీఎం రేవంత్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్‌‌‌‌ చిరంజీవిని ఎన్టీఆర్‌‌ జాతీయ పురస్కారం వరించింది. ప్రముఖ నటుడు కమల్‌‌ హాసన్‌‌కు పైడి జయరాజ్‌‌ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్‌‌ తేజకు సినారె అవార్డు లభించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు, షార్ట్‌‌ఫిల్మ్‌‌లకు ఈ అవార్డులు ప్రకటించారు.  శనివారం హైదరాబాద్‌‌ మసాబ్ ట్యాంక్ లోని ఫిలిం డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ (ఎఫ్‌‌డీసీ) కార్యాలయంలో చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కేటగిరీల వారీగా అవార్డు గ్రహీతల వివరాలను వెల్లడించారు.  ఈ అవార్డులను మార్చి 19న ఉగాది రోజు సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రదానం చేయనున్నారు. 

అంతకుముందు ప్రజాభవన్‌‌‌‌లో టీజీఎఫ్ఏ జ్యూరీ కమి టీ మెంబర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల లిస్ట్‌‌‌‌ను అందజేశారు. మొత్తం 8  మందికి స్పెషల్ అవార్డులు ప్రకటించగా, వివిధ కేటగిరీల్లో 36 మందికి,  మరో 10 మందికి ఇతర కేటగిరీల్లో మొత్తం 54 మందికి అవార్డులను ప్రకటించారు.  స్పెషల్ అవార్డులకు చిరంజీవి, కమలాసన్‌‌‌‌, అశోక్‌‌‌‌ తేజతోపాటు ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, నటుడు ఆర్. నారాయణ మూర్తి, రమేశ్‌‌‌‌బాబు, ప్రముఖ నటి జయసుధను జ్యూరీ కమిటీ ఎంపిక చేసింది.

బెస్ట్ ఫీచర్ చిత్రాలుగా రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీలు ఎంపికయ్యాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌‌‌‌లో జాతీయ సమగ్రత అంశంపై తెరకెక్కిన ‘తండేల్’ మూవీకి అవార్డు దక్కింది. బెస్ట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఫిల్మ్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంపికైంది. బెస్ట్ సోషల్ మెసేజ్ మూవీగా ‘కోర్ట్’కు అవార్డు దక్కింది.  బెస్ట్ లీడింగ్ హీరోగా అక్కినేని నాగ చైతన్య, బెస్ట్ హీరోయిన్‌‌‌‌గా రష్మిక మందనాకు గద్దర్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది.