- భక్తరామదాసు తర్వాత ప్రజాప్రభుత్వంలోనే పనులకు శ్రీకారం
- పుష్కరాల నాటికి తొలిదశ పనులు పూర్తి చేస్తం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
భద్రాచలం, వెలుగు: భక్తులు మెచ్చే, నచ్చే రీతిలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాచలం రామాలయంలో జరగనున్న తొలిదశ పనులపై బుధవారం సాయంత్రం ఆర్అండ్బీ, ఎండోమెంట్ అధికారులతో కలిసి సమీక్షించారు. తొలుత రంగనాయకులగుట్ట వద్ద భూసేకరణ చేపట్టిన చోట హద్దులను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసిన జెండాల గురించి ఆరా తీశారు. అటు ఆర్అండ్బీ ఇటు ఎండోమెంట్ ఆఫీసర్లు సరైన రీతిలో వివరాలు చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాడు భక్తరామదాసు తర్వాత నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వంలోనే ఆలయాభివృద్ధికి అడుగుపడుతుందని పేర్కొన్నారు. మాడవీధుల విస్తరణ, ప్రాకారాల నిర్మాణాలు, ఉపాలయాల్లోని మూర్తుల తరలింపు, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని ప్రాకార మండపంలో వైదిక కమిటీ, ఎండోమెంట్, ఆర్అండ్బీ ఇంజనీర్లతో పాటు స్తపతులతో సమావేశమయ్యారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు జరిగేలా ప్రణాళికల ప్రకారం ముందుకు పోవాలన్నారు. రూ.351 కోట్ల పనులన్నీ పుష్కరాల నాటికి పూర్తి చేయాలన్నారు. వేదపండితులు, స్తపతులు,ఆర్కిటెక్‌ల సహకారంతో విశాలంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాములవారి దీవెనలతో పనులు పూర్తి చేస్తామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా శాస్త్రోక్తంగా ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎండోమెంట్ కమిషనర్ హన్మంత్‌రావు, ఈవో దామోదర్‌రావు ఉన్నారు.

