- రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర టెంపుళ్ల అభివృద్ధి పనులు
- టెండర్లు దక్కించుకున్న క్షేత్ర, తనికెళ్ల ఏజెన్సీలు
- ఇప్పటికే సీఎం చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన
- టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో స్పీడందుకోనున్న పనులు
- గోదావరి పుష్కరాల వరకు పూర్తిచేసేలా ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. దీంతో పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని విశ్వస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.586 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఆమోదించింది.
మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులను చేపట్టనుండగా.. ఈ మేరకు రూ.351 కోట్లతో మొదటి దశ పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారు పిలువగా.. క్షేత్ర ఏజెన్సీ పనులు దక్కించుకున్నట్టు సమాచారం.
గోదావరి ఘాట్ల విస్తరణ, భక్తులకు మెరుగైన వసతులు, ఆలయ పరిసరాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు. తొలిదశలో గోదావరి ఘాట్ల విస్తరణ, భక్తులకు మెరుగైన వసతులు, ఆలయ పరిసరాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా భద్రాచల క్షేత్రానికి కొత్త కళ రానుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం రూ.225 కోట్లు కేటాయించింది. ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడంతోపాటు మాఢ వీధులు, పుష్కరిణి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
ఇందుకు సంబంధించి టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. ఈ పనులను తనికెళ్ల ఏజెన్సీ కైవసం చేసుకున్నట్టుగా తెలిసింది. కాగా, ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఆలయ పునర్నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శృంగేరి పీఠాధిపతుల సంప్రదింపులతో తుది ప్రణాళిక సిద్ధం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ రెండు ఆలయాల్లో భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.

