భద్రాద్రికొత్తగూడెం/ జూలూరుపాడు, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్త్రీనిధి రుణాల రికవరీ కేవలం 13.5 శాతానికే పరిమితం కావడంపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా రికవరీ శాతం ఆశించిన స్థాయిలో లేదన్నారు. భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట ప్రాంతాల్లో రికవరీ మరింత తక్కువగా ఉందని తెలిపారు.
వచ్చే రెండు నెలల్లో కనీసం 60 శాతం రికవరీ సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీవో భవనాల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన డీఎల్సీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏకలవ్య పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జూలూరుపాడు మండలంలో నిర్వహిస్తున్న సర్వే పనులను పరిశీలించి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ సర్వే పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. పడమటి నరసాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు.
