భద్రాద్రికొత్తగూడెం: అధిక వడ్డీ పేరిట మోసం..రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్లతో కాంట్రాక్టర్ పరార్

భద్రాద్రికొత్తగూడెం: అధిక వడ్డీ పేరిట మోసం..రూ. 30 కోట్ల నుంచి  రూ. 40 కోట్లతో కాంట్రాక్టర్ పరార్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అధిక వడ్డీ ఇస్తానని నమ్మించిన ఓ కాంట్రాక్టర్ చివరకు కోట్లాది రూపాయలతో పరార్ అయ్యాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి సింగరేణితో పాటు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వివిధ కాంట్రాక్ట్​పనులు చేస్తుండేవాడు. కాంట్రాక్ట్ పనులకు అవసరం అంటూ కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం, పాల్వంచ, మణుగూరు, చింతూరు ప్రాంతాల్లో పలువురి వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకునేవాడు. మొదట్లో వడ్డీ సరిగానే చెల్లించాడు. 

కొంత కాలం తర్వాత పెద్ద పెద్ద వర్క్స్ వస్తున్నాయని, తన వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని చెప్పాడు. దీంతో నిజమేనని నమ్మిన పలువురు వ్యక్తులు అతడికి డబ్బులు ఇచ్చారు. కొన్ని రోజులుగా వడ్డీలు చెల్లించకపోవడం, కాంట్రాక్టర్ కనిపించకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ఆరా తీయగా.. అతడు పరారైనట్లు తెలిసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ రోహిత్ రాజ్ కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ కోసం గాలిస్తున్నారు. కాంట్రాక్టర్ రూ. 30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.