భద్రాద్రి అభివృద్ధి ఏదీ.?..ఆరేండ్లుగా పైసా ఇవ్వని సర్కార్

భద్రాద్రి అభివృద్ధి ఏదీ.?..ఆరేండ్లుగా పైసా ఇవ్వని సర్కార్
  • కేంద్రం ‘రామాయణ్​ సర్క్యూట్‍’ కింద చేర్చినా.. రాష్ట్రం పట్టించుకోలె
  • సర్కారు డీపీఆర్​ ఇవ్వక 30 కోట్లు వెనక్కి..ఇప్పుడు ‘ప్రసాద్’​ కింద చేర్చేందుకు పాట్లు
  • మాస్టర్​ ప్లాన్​ మూలకు..భక్తులకు సౌకర్యాలు కరువు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధి కోసం  ఎన్నో మాటలు చెప్పిన రాష్ట్ర సర్కారు.. వాటిని కాటగల్పింది. ఇస్తామన్న పైసలు ఇస్తలేదు.  చేస్తామన్న పనులు చేస్తలేదు. 2016లోనే కేంద్ర టూరిజం శాఖ  ‘రామాయణ్​ సర్క్యూట్​’లో భద్రాచలం దేవస్థానాన్ని చేర్చి రూ. 30 కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్ ​ఇవ్వకుండా ఫండ్స్​ వదులుకుంది. ఇప్పుడేమో అదే కేంద్రం తెచ్చిన పిలిగ్రిమేజ్​ రెజువెనేషన్​ అండ్​ స్పిరిచ్యువాలిటీ ఆగ్యుమెన్షన్​ డ్రైవ్​ (ప్రసాద్​) స్కీం కింద రూ. 50 కోట్లతో ప్రపోజల్స్​ పంపేందుకు  రెడీ అవుతోంది.  ఈ క్రమంలో ‘ మన భద్రాద్రి రాముడిని మనం డెవలప్ చేసుకుందాం.. అయోధ్య రామాలయం మనకెందుకు?’ అంటూ ఇటీవల పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామాలయం అంశంవచ్చేసరికి కావాలనే భద్రాద్రి రాముడి గురించిమాట్లా డుతున్నారని, అంత ప్రేమ ఉన్నవాళ్లయితే ఈఆరేండ్లలో భద్రాచలం దేవస్థానాన్ని ఎందుకు డెవలప్చేయలేదని బీజేపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు.

ఇంతన్నరు.. అంతన్నరు..

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగేండ్ల కింద చినజీయర్ స్వామి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి గీసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం.. భద్రాద్రిలో కంచెర్ల గోపన్న కట్టడాలకు ఎలాంటి భంగం కలగకుండా చుట్టూ ప్రాకారాలుకట్టాలి. మొదటి ప్రాకారాన్ని 20 అడుగులు, రెండో ప్రాకారాన్ని 50 అడుగుల ఎత్తులో నిర్మించాలని మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు. ఎటు నుంచి చూసినా ఆలయం చూడచక్కగా కనిపించేలా శిల్ప కళాశోభితంగా నిర్మాణాలు ఉండాలని ప్రతిపాదించారు. రామయ్యకల్యాణం కోసం ప్రత్యేకంగా వెయ్యి కాళ్ల మండపాన్నినిర్మించాలని అనుకున్నారు. 40 అడుగులు విస్తరించిన మాడవీధులు, గోదావరి వద్ద పుష్కరిణి, పర్ణశాలను డెవలప్ చేయాలని భావించారు. ఇక 105 అడుగుల ఎత్తయిన శ్రీరామ స్తూపాన్ని నిర్మించాలని డిజైన్ లో పేర్కొన్నారు. ఇందుకోసం మిథిలా స్టేడియం చుట్టు పక్కల 65 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికీ అడుగు భూమి కూడా సేకరించలేదు. ఈలోగా ఏపీలోని పురుషోత్త పట్నంలో ఉన్న తమ భూమిలో గోశాల, నక్షత్రవనం, పూల, తులసి తోటల ఏర్పాటుకు దేవాలయ అధికారులు సర్కారుకు ప్రపోజల్స్ పంపారు. కానీ ‘మాస్టర్ ప్లాన్ ఉంది కదా?అందులో భాగంగానే చేద్దాం అని ప్రభుత్వ పెద్దలుచెప్పడంతో అందరూ సైలెంట్ అయ్యా రు.

అప్పుడు వద్దన్నరు.. ఇప్పుడు అడుగుతున్నరు..

2016లోనే కేంద్ర టూరిజం శాఖ ‘స్వదేశీ దర్శన్‍’పేరుతో రామాయణం సర్క్యూట్ లో భద్రాచలం దేవస్థానాన్ని చేర్చింది. రామాయణంలో ముడిపడి ఉన్న9 రాష్ట్రా లు, 15 ప్రాంతాలను కలుపుతూ పిల్‍గ్రిమ్‍ట్రైన్ ను నడిపింది. రూ. 500 కోట్ల ఈ ప్రాజెక్టులోభద్రాచలంలో ఫెసిలిటీస్ కల్పించేందుకు తొలివిడతరూ. 30 కోట్లు కేటాయించింది. కానీ ఈ స్కీంకు స్టేట్ గవర్నమెంట్ మోకాలడ్డింది. తామే డెవలప్ చేసుకుంటం అన్న ధీమాతో కనీసం డీపీఆర్ కూడా ఇవ్వకపోవడంతో ఫండ్స్ వెనక్కివెళ్లాయి. ఇప్పుడు చేతిలో పైసల్లేకపోవడంతో కేంద్రం వైపు చూస్తోంది. కేంద్రం తెచ్చిన ప్రసాద్ స్కీం కింద భద్రాచలాన్ని చేర్చు కోవాలని రాష్ట్రటూరిజం డిపార్ట్ మెంట్‍ వెంటపడుతోంది. ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్‍, టూరిజం ఎండీ మనోహర్‍,ఈడీ శంకర్ రెడ్డి భద్రాచలం వచ్చి, రూ. 50 కోట్లతో భద్రాద్రి డెవలప్ మెంట్ కు ప్రపోజల్స్ రెడీ చేయాలని టెంపుల్ ఆఫీసర్లను ఆదేశించి వెళ్లారు. వీళ్లొచ్చిపోయాక ఓ ఆర్కిటెక్‍  టీం టెంపుల్ ఆఫీసర్ల నుంచి రామాయణం థీమ్​ పార్కు , రామాయణం ఇతివృత్తాంతాలపై లేజర్ షో, కల్యాణ మండపం, వంటశాల(పోటు) ఆధునీకరణ, కరకట్టపై టవర్ హౌస్‍, శాశ్వతలైటింగ్‍, పడమర, దక్షిణ మెట్ల ఆధునీకరణ, డార్మెటరీ హాళ్ల నిర్మాణం, సౌండ్‍ సిస్టమ్‍… ఇలా డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‍) తీసుకెళ్లారు. ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కేంద్ర టూరిజం నుంచిరూ. 50 కోట్లు తేవాలని చూస్తున్నారు. దీంతో రాష్ట్ర సర్కారు తీరుపై బీజేపీ లీడర్లు, హిందూ సంఘాలనేతలు ఫైర్ అవుతున్నారు. ‘‘సీఎం హోదాలో కేసీఆర్ ఇస్తామన్న వంద కోట్లు ఇవ్వలేదు.. ‘స్వదేశీ దర్శన్‍’కింద కేంద్రం ఇచ్చిన రూ. 30 కోట్లు తీసుకోలేదు..ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్రసాద్ ఫండ్స్ కోసం చూస్తున్నారు.. ఇదేం పద్ధతి?’’ అని విమర్శిస్తున్నారు. అయోధ్య రామాలయానికి చందాలు సేకరిస్తుంటే ఎక్కడతమకు క్రెడిట్ దక్కు తుందోనని, మనకు భద్రాద్రి లేదా? అని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని, అంత ప్రేమే ఉంటే ఈ ఆరేండ్లలో టెంపుల్ ను ఎందుకు డెవలప్ చేయాలేదని నిలదీస్తున్నారు.

వారంలో వస్తానన్నడు.. నాలుగున్నరేండ్లు దాటె

2016 ఏప్రిల్​ 15న సీఎం హోదాలో భద్రాద్రికి వచ్చిన కేసీఆర్​.. టెంపుల్​ను అద్భుతంగా డెవలప్​ చేస్తామని హామీ ఇచ్చారు. వారంలో మళ్లీ వస్తానని చెప్పారు. అంతే..! మళ్లీ ఇప్పటికీ ఆ వైపు చూడటం లేదు. డెవలప్‍మెంట్ మాట అటుంచితే  ప్రతి శ్రీరామ నవమికి తానీషా సంప్రదాయం ప్రకారం తీసుకురావాల్సిన ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను కూడా సీఎం తీసుకురావడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఒకసారి తన మనుమడితో వాటిని పంపించి అభాసుపాలు చేశారని విమర్శిస్తున్నాయి. స్వామీజీలు కూడా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ఆంధ్రా నుంచి గురువారం భద్రాచలం రానున్న ఓ స్వామీజీ.. భద్రాద్రి రామయ్యకు జరుగుతున్న అన్యాయంపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకుంటానన్నారు.  ఇటీవల భద్రాద్రి వచ్చిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అయితే సర్కార్​కు 15 రోజుల డెడ్​లైన్​పెట్టి పోయారు.

ఉమ్మడి రాష్ట్రంలో మన దేవాలయాలు ఆదరణకు నోచుకోలేదు.. ముఖ్యంగా దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేవు.. కొట్లాడి సాధించుకున్న మన తెలంగాణలో ఇప్పుడు సుందర భద్రాద్రిగా తీర్చిదిద్దుకుందాం.. రూ. 100 కోట్లు కేటాయిస్తా.. మరోసారి భద్రాచలం వచ్చి వారం రోజులు ఇక్కడే ఉంటా.. ఏమేం కావాల్నో అన్నీ తెలుసుకుని డెవలప్ చేసుకుందం.

– 2016లో  సీఎం కేసీఆర్‍ ఇచ్చిన మాట ఇది