- ఉదయం 11:45 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
- కొత్త హాల్‌లో కొలువుదీరనున్న శాసన మండలి
- ఇయ్యాల గవర్నర్, సీఎం చేతుల మీదుగా అసెంబ్లీ
- ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- ఈసారి 3.04 లక్షల కోట్లతో బడ్జెట్!
- రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్లు పెరగనున్న అంచనాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు శాసనసభ, మండలిని ఉద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఇందులో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే అనుకున్న తేదీ ప్రకారం ఈ నెల 20న శాసన సభలో, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తున్నది.
ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. అయితే కొన్ని బిల్లులకు ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నందున అవసరానికి తగ్గట్టుగా నెలాఖరు తర్వాత కూడా రెండు , మూడు రోజులు సమావేశాలు కొనసాగించే చాన్స్ ఉంది. ఇదిలా ఉండగా పాలన వైఫల్యాలు, తప్పిదాలు సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సిద్ధమయ్యారు.
గతానికి భిన్నంగా ఈ దఫా అసెంబ్లీ భవనంలోని కొత్త హాల్‌లో శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి.ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఇందులో అధికారులు ఇప్పటికే అన్ని రకాల సాంకేతిక, మౌలిక ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో గతంలో మాదిరి అటు మండలి , ఇటు అసెంబ్లీ రెండు వైపులా మంత్రులు అటు ఇటు తిరిగే సమస్య కూడా తప్పింది. అదే సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం సీఎం, గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
రూ. 20 వేల కోట్లు పెరగనున్న పద్దు?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో రానున్న 2026-–27 బడ్జెట్ లెక్కలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రూ. 3.04 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంచనా వేసింది. ఈ భారీ బడ్జెట్ అంచనాలతోనే గత ఏడాది కాలంగా పలు అభివృద్ధి పనులను సర్కారు నెట్టుకొచ్చింది. అయితే కొత్త స్కీమ్స్, హామీలు మరిన్ని అమలు చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా కేటాయింపులు పెంచే అవకాశం కనిపిస్తున్నది.
ఇప్పటికే అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి.. ప్రతిపాదనలపై ఒక అంచనాకు వచ్చారు. ఆసరా నిధుల పెంపుతోపాటు ప్రధానంగా సంక్షేమ రంగానికి, వ్యవసాయం, విద్య, వైద్య , సాగునీటి రంగాలకు ఈ సారి కేటాయింపులు పెరగనున్నట్టు తెలుస్తున్నది. ఈ సారి బడ్జెట్ 2027-–28లో 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పథకాల అమలు, పాత పథకాలకు నిధుల సర్దుబాటు కోసం ఈ పెంపు సర్కారుకు అనివార్యంగా మారింది.
అయితే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పన్నుల వాటా కాస్తా ఈ సారి పెరగనుంది. దీంతో వీటిపై ఆధారపడి కూడా బడ్జెట్ కసరత్తు జరుగుతున్నది. పెరిగిన బడ్జెట్ అంచనాలకు తగినట్టుగా కొత్త ఆదాయ మార్గాలను కూడా ప్రతిపాదించనుంది. ఇప్పటికే అన్ని రకాలుగా ప్రభుత్వ ఆదాయం 85 శాతం వరకు ఉన్నట్టు తెలుస్తున్నది. పన్నేతర ఆదాయం తగ్గింది. రూ.31 వేల కోట్లు అంచనా వేయగా.. ఇప్పటి వరకి 8,500 కోట్ల మేర వచ్చింది. 70 శాతం మేర లోటు ఉంది. అదే పన్ను ఆదాయం ఫిబ్రవరి నాటికి 1.75 లక్షల కోట్లకు 1.40 లక్షల కోట్లు వసూలయ్యాయి.
నేడు సీఎం అధ్యక్షతన సీఎల్పీ భేటీ
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ హాల్‌లో ఈ భేటీ నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను ఎలా తిప్పికొట్టాలి, ప్రభుత్వ ప్రాధాన్యతలను సభలో ఎలా చాటిచెప్పాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
