- పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం
- రవాణా, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలపై ఎఫెక్ట్
- ఒడిశా, తమిళనాడుతో
- సహా పలు రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం
- బెంగాల్, త్రిపుర, గుజరాత్‌లో కనిపించని సమ్మె సెగ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ట్రేడ్ యూనియన్ల ఉమ్మడి వేదిక ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపుకు మిశ్రమ స్పందన లభించింది. పలు రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. మరికొన్ని రాష్ట్రాల్లో దాని ప్రభావం బలంగా కనిపించింది. భారత్ బంద్ ప్రభావం రవాణా, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలపై పడింది. పలు రాష్ట్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఒడిశా, కేరళ, తమిళనాడు, గోవా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. ఒడిశాలో జనజీవనం స్తంభించింది. జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించడంతో రవాణా సేవలు నిలిచిపోయాయి. భువనేశ్వర్, కటక్, బెర్హంపూర్, సంబల్పూర్ సహా అన్ని ప్రధాన పట్టణాల్లో విద్యాసంస్థలు, మార్కెట్లు, వ్యాపారసంస్థలు మూతపడ్డాయి. జార్ఖండ్‌లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, బొగ్గు గనుల రంగాలపై సమ్మె ప్రభావం పడింది. రాష్ట్రంలో బంద్కు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్ పనులపై ప్రభావం
ఛత్తీస్‌గఢ్‌లో ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో జాతీయ బ్యాంకులు మూతపడ్డాయి. భీమా సంస్థలు, పోస్టాఫీసులకు చెందిన సిబ్బంది, కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో ఆయా రంగాల్లో కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. మైనింగ్ కార్యకలాపాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్ యథావిధిగా పనిచేసింది. తమిళనాడులోని తూత్తుకుడి, చెన్నై ఓడరేవుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. పారిశ్రామిక హబ్ అయిన శ్రీపెరంబుదూర్‌లోని తయారీ యూనిట్ల వద్ద కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రవాణా వాహనాల కొరతతో సరుకు రవాణాకు ఆటంకం ఏర్పడింది.
బెంగాల్, త్రిపురలో యథావిధిగా రాకపోకలు
పశ్చిమ బెంగాల్, త్రిపుర, గుజరాత్ రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, మార్కెట్లు తెరిచే ఉన్నాయి. గుజరాత్‌లో కూడా బంద్ ప్రభావం కనిపించలేదు. రవాణా సేవలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. అహ్మదాబాద్, సూరత్, వడోదర వంటి సిటీల్లో మార్కెట్లు, విద్యాసంస్థలు యథావిధిగా పని చేశాయి.
కేరళలో నో వర్క్, నో పే
భారత్ బంద్ సందర్భంగా కేరళ ప్రభుత్వం ‘డైస్-నన్’ (చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించని రోజు, నో వర్క్, నో పే)డేగా ప్రకటించింది. అయితే, బస్సులు, ఆటోలు రోడ్డెక్కకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు తక్కువగా నమోదైంది. ప్రైవేట్ బస్సులు, కేఎస్ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాబ్ లో అధికార పార్టీ ఆప్ సమ్మెకు మద్దతు ప్రకటించింది. పార్టీ శ్రేణులు రైతులు, కార్మికులకు అండగా నిరసనల్లో పాల్గొన్నాయి. గోవాలో ఆందోళనకు మిశ్రమ స్పందించింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలు నిలిచిపోయాయి. కానీ, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. మధ్యప్రదేశ్ లో డిఫెన్స్ సంస్థల్లో పని చేస్తున్న సుమారు 25,000 మంది పౌర ఉద్యోగులు గంట ఆలస్యంగా విధులకు హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. ఆ రాష్ట్రంలో మార్కెట్లు, పాఠశాలలు, కాలేజీలు తెరిచే ఉన్నాయి.
