అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం : ఇలా అందించండి

అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం : ఇలా అందించండి

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారతావని ముందుకొస్తోంది. 2వేల 547 మంది సీర్పీఎఫ్ బలగాలు… 78 బస్సుల కాన్వాయ్ లో ప్రయాణిస్తుండగా ఫిబ్రవరి 14న జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన SUV వాహనంతో సైనిక బలగాలను ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు. వీరి త్యాగాలకు సెల్యూట్ చేస్తూ… వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. ఇందుకోసం.. కేంద్ర హోంశాఖ రూపొందించిన భారత్ కే వీర్ డాట్ కామ్bharatkeveer.gov.in అనే పోర్టల్ తో సహాయం అందించవచ్చు.

bharatkeveer.gov.in వెబ్ సైట్ ద్వారా ఆర్థిక సహాయం చేయొచ్చు. లేదా ఆండ్రాయిడ్, ఐ స్టోర్ లో మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని సహాయం చేయొచ్చు.

2017 ఏప్రిల్ లో హోంశాఖ ఈ యాప్ ను రూపొందించింది.  సైనికుల కుటుంబాలకు పౌరులు నేరుగా ఆన్ లైన్ లో ఆర్థిక సహాయం అందించే వీలును కల్పిస్తూ… ఈ అప్లికేషన్ రూపొందించారు. పౌరులు ఎవరైనా సహాయం చేస్తే… సైనికుల కుటుంబాల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బులు డిపాజిట్ అవుతాయి. వెబ్ సైట్ లో.. అమరులైన జవాన్ల వివరాలు, బ్యాంక్ ఖాతాలు పొందుపరిచారు. అమరులకే కాకుండా.. వీర జవాన్ల సంక్షేమం కోసం ఉద్దేశించిన ‘భారత వీరుల కార్పస్ ఫండ్’ అనే సెగ్మెంట్ కూడా ఉంది. దానిలోనూ డబ్బులు జమ చేయొచ్చు. అందరికీ లేదా.. ఒక్కొరికి.. లేదా ఎంతమంది అంటే అంతమందికి డబ్బులను పంపించొచ్చు.

కనీసం రూ.10.. ఎక్కువగా రూ.15లక్షలు

డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఓ లిమిట్ ను పెట్టింది కేంద్ర హోంశాఖ. ఎవరి స్తోమతను బట్టి వారు ఆర్థిక సహాయం అందించొచ్చు. రూ.10 లను కూడా సైనిక కుటుంబాల అకౌంట్ లోకి డిపాజిట్ చేయొచ్చు. కనీసం 10 రూపాయల నుంచి… గరిష్టంగా రూ.15లక్షల వరకు ఎవరైనా ఆర్థిక సహాయం అందించవచ్చు. పౌరులు ఒక అమర జవాన్ కుటుంబానికి మొత్తంగా రూ.15లక్షల వరకు మాత్రమే సాయం అందించే వీలుంది. ఆ తర్వాత అదే అకౌంట్ కు ఎవరైనా డబ్బులు పంపితే… భారత వీరుల కార్పస్ ఫండ్ లో ట్రాన్స్ ఫర్ అవుతాయి.

కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ కు సహాయం అందించినందుకు కృతజ్ఞతగా పౌరులకు ఓ సర్టిఫికెట్ కూడా అందుతుంది. గౌరవనీయ ప్రముఖులు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో కూడిన బృందం… కార్పస్ ఫండ్ సహాయనిధిని అవసరంలో ఉన్న సైనిక కుటుంబాలకు ఎప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేస్తుంటుంది.

భారత్ కే వీర్ bharatkeveer.gov.in వెబ్ సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా.. అస్సాం రైఫిల్స్(AR), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG), సశస్త్ర సీమాబల్(SSB)  కు చెందిన అమరులైన జవాన్ల కుటుంబాలకు సహాయం చేయవచ్చు.

ఈ పోర్టల్ ద్వారా చేసే విరాళానికి ఆదాయపు పన్ను శాఖ మినహాయింపు ఉంటుంది. సినీ నటుడు అక్షయ్ కుమార్ సైనిక సహాయనిధి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన భీకరమైన ఉగ్రదాడిని దేశం మొత్తం ఒకే వాయిస్ తో ఖండించింది. సైన్యానికి, అమరులైన సైనిక బలగాల కుటుంబసభ్యులకు అండగా ఉంటామని నినదిస్తోంది. వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ముందుకొస్తోంది.