V6 News

మానవీయ కోణాన్ని మరవకండి...శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్-1 ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం భట్టి సూచన

మానవీయ కోణాన్ని  మరవకండి...శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్-1 ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం భట్టి సూచన

హైదరాబాద్, వెలుగు: అధికారులు సంతకం చేసే ప్రతి ఫైల్​వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆ ఫైల్​ను కేవలం కాగితంలా చూడకండి.. అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి అని గుర్తుంచుకోవాలని నూతనంగా ఎంపికైన గ్రూప్–-1 ఆఫీసర్లకు సూచించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో 6 వారాలపాటు జరిగిన గ్రూప్-–1 ఫౌండేషన్ కోర్సు(బ్యాచ్–2) ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 214 మంది అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని, నైతిక విలువలను ఎట్టిపరిస్థితుల్లోనూ మరవొద్దని సూచించారు. 

పరిపాలనలో వేగం పెరగాలని, ప్రతి నిర్ణయం పేదల దరికి చేరాలని చెప్పారు. ఫైళ్లు, సమీక్షల హడావుడిలో పడి సామాన్యులను విస్మరించొద్దని, చట్టాలకు లోబడి పని చేయాలన్నారు. ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో వాడుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారాన్ని అనుభవించడం కోసం కాకుండా.. కోట్లాది మంది తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పని చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ అరుణ్ కుమార్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.