- తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేశాం: భట్టి
- తమిళనాడులోని షోలింగర్ సెగ్మెంట్‌లో ప్రచారం
హైదరాబాద్, వెలుగు: తమిళ ప్రజలు అభివృద్ధి, లౌకికవాదానికే పట్టం కడతారని.. ఆత్మగౌరవానికి ప్రజల మద్దతు ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఏఐసీసీ పరిశీలకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీతో కలిసి రాణిపేట జిల్లా షోలింగర్ నియోజకవర్గంలోని కారిక్కల్, వీరనత్తూర్, అరియూర్, అయిపేడు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, ఎం.కె.స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. రైతు భరోసా కింద రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
తమిళనాడు రాజకీయాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అదొక గొప్ప సిద్ధాంతం. పెరియార్, అన్నాదురై, కరుణానిధి వంటి మహనీయులు ఇక్కడ సామాజిక న్యాయానికి బలమైన పునాదులు వేశారన్నారు. ఢిల్లీ పీఠంపై ఉన్న పాలకులు తమిళ సంస్కృతిని, భాషను, హక్కులను అణచివేయాలని చూస్తున్నారని భట్టి విమర్శించారు. ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే సెక్యులర్ శక్తుల ఐక్యత అనివార్యమని, అందుకే స్టాలిన్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

