అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి విజయం..జట్టును అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి 

అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి విజయం..జట్టును అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన సింగ‌‌రేణి రెస్క్యూ జట్టును రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. ఇటీవల జాంబియా దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ మైన్స్​ రెస్క్యూ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన జట్టు సభ్యులు సంస్థ సీఎండీ బుద్ధా ప్రకాశ్​ జ్యోతితో కలిసి శ‌‌నివారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో డిప్యూటీ సీఎంను కలిశారు. ఈ సంద‌‌ర్భంగా వారు సాధించిన ప్రతిష్ఠాత్మక ట్రోఫీల‌‌ను, మెడ‌‌ల్స్ ను డిప్యూటీ సీఎంకు అందించారు.

పోటీల వివరాలను సీఎండీ వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. భూగర్భ గనుల రక్షణలో తామెప్పుడూ అగ్రగామినే అని సింగరేణి సంస్థ ప్రపంచ వేదికపై మరోసారి నిరూపించిందన్నారు.  చైనా, కెనడా, ఆస్ట్రేలియా, పోలాండ్, కొలంబియా వంటి గనులు అధికంగా ఉండే దిగ్గజ దేశాల జట్లతో పోటీపడి మరీ భూగర్భ రెస్క్యూ విభాగంలో ప్రథమ బహుమతి కైవసం చేసుకోవ‌‌డం గ‌‌ర్వకార‌‌ణ‌‌మ‌‌ని చెప్పారు.  గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, రెస్క్యూ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి అందించే సేవలు అసమానమైనవని కొనియాడారు. రెస్క్యూ సిబ్బంది నైపుణ్యం, అంతర్జాతీయ పోటీల ద్వారా ప్రపంచానికి తెలిసిందన్నారు.